సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ నియామకం.
* జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం.
* సిద్ధరామయ్య ప్రతిపాదనకు ఆమోదం.
* ముగిసిన సీఎల్పీ సమావేశం.
* లోక్ భవన్‌కు చేరుకున్న డీకే శివకుమార్, సిద్ధరామయ్య.
*
బెంగళూరు, మహా.
**కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో నూతన నేతగా డీకే శివకుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. నూతన ముఖ్యమంత్రిగా శివకుమార్ జూన్ 3వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు**
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. శనివారం బెంగళూరులోని విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ నేతగా శివకుమార్ పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర బలపరిచారు. దీనికి సమావేశానికి హాజరైన శాసనసభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన నాయకుడి ఎంపిక అనివార్యమైంది. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు శనివారం సాయంత్రం విధాన సౌధలో పార్టీ శాసనసభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ పరిశీలకుల సమక్షంలో ఈ ఎంపిక ప్రక్రియ అత్యంత సాఫీగా సాగింది. ఎక్కడా ఎలాంటి భిన్నాభిప్రాయాలు రాకుండా అధిష్టానం ముందుగానే అన్నీ చక్కదిద్దింది. ఈ క్రమంలోనే సీఎల్పీ సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించడం విశేషం. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ తమ పూర్తి మద్దతును తెలియజేశారు.
సమావేశం ముగిసిన అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారని ఆయన స్పష్టం చేశారు. అందరి అంగీకారంతో ఈ నిర్ణయం జరిగిందని ఆయన వివరించారు. శివకుమార్ జూన్ 3వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎల్పీ సమావేశం ముగిసిన వెంటనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇరువురు కలిసి బెంగళూరులోని లోక్ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ వారు నూతన ప్రభుత్వ ఏర్పాటు తదితర అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. త్వరలోనే మంత్రివర్గ కూర్పుపై కూడా స్పష్టత రానుంది.
జూన్ 3వ తేదీ సాయంత్రం లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత నిరాడంబరంగా జరగనుంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు భారీ ఎత్తున జనసమీకరణ జరుగుతుంది. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ వేడుకను కేవలం ఆహ్వానితుల మధ్య సాదాసీదాగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కార్యకర్తలు ఎవరూ బెంగళూరుకు తరలిరావద్దని, ట్రాఫిక్ సమస్యలు సృష్టించవద్దని పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. డీకే శివకుమార్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార మార్పిడి జరగడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. సిద్ధరామయ్య గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా అందించిన సేవలను ఈ సీఎల్పీ సమావేశంలో నాయకులందరూ కొనియాడారు. సిద్ధరామయ్య సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ డీకే శివకుమార్ ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.







