‘సేనా గళం’తో కుల రాజకీయాలకు చెక్.
* వ్యక్తిగత తప్పులకు కులమతాలను ఆపాదించడం సరికాదు.
*‘బూర్జువా’ ధోరణికి స్వస్తి పలకాలి.
* సామాజిక సామరస్యమే లక్ష్యంగా సరికొత్త కమిటీ ఏర్పాటు.
* జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
అమరావతి, మహా.
దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను పట్టి పీడిస్తున్న కుల, మత, విద్వేషపూరిత రాజకీయాలకు చరమగీతం పాడేందుకు జనసేన ని సిద్ధంగా ఉండాలని జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సమకాలీన రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ, సామాజిక సామరస్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా జనసేన పార్టీలో ‘సేనా గళం’ అనే నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. ఆదివారం అమరావతిలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు కీలక దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, ముఖ్యంగా నేటి ‘జెన్ జీ’ యువత ఆలోచనలు, ఆశయాలను ప్రతిబింబించేలా ఈ కమిటీ బలమైన గళం వినిపించనుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ముల్లును ముల్లుతోనే తీయాలనే పాతబడిన నానుడిని పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో తీవ్రంగా తప్పుబట్టారు. ఒక సామాజిక వర్గాన్ని అదే వర్గంతో తిట్టించే ‘బూర్జువా’ ధోరణికి ఇకపై తావులేదని కుండబద్దలు కొట్టారు. కాపులు తిడితే కాపులతోనే తిట్టించడం, రెడ్లు లేదా కమ్మవారు విమర్శిస్తే తిరిగి అదే సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో ప్రతి విమర్శలు చేయించడం, అలాగే షెడ్యూల్డ్ కులాల వారు ఆరోపణలు చేస్తే తిరిగి అదే కులాల వారితో కౌంటర్లు ఇప్పించడం వంటి బూజుపట్టిన రాజకీయ విధానాలకు జనసేన పార్టీ శాశ్వతంగా స్వస్తి పలుకుతోందని ఆయన ఉద్ఘాటించారు. రాజ్యాంగానికి కట్టుబడి, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తూ, దేశ సమగ్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఈ ‘సేనా గళం’ కమిటీ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కేవలం ఒక రాజకీయ పార్టీగానే కాకుండా, అత్యున్నత సామాజిక బాధ్యతతో జనసేన ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయాల్లో కొందరు నాయకులు చేసే వ్యక్తిగత తప్పులను వారికే పరిమితం చేయకుండా, వారు పుట్టిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సమాజంలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కునే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, నేటి ఆధునిక యువత ఇటువంటి కుహనా రాజకీయ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని హితవు పలికారు. ఇకపై రాజకీయాల్లో ఎవరైనా తప్పులు చేస్తే, ఆ వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలని, ఆయా వ్యక్తుల వ్యవహారాల్లోకి మొత్తం సామాజిక వర్గాలను లాగకూడదనే అత్యంత స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు.








