రాచరికాన్ని సహించం..
* ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ విధానం.
* మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం.
* మహిళా సాధికారతే లక్ష్యం.
* 67 వేల ఉద్యోగాలిచ్చాం.
* పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన.
హైదరాబాద్, మహా.
తెలంగాణ సమాజం రాచరికాన్ని, పెత్తనాన్ని ఎంతమాత్రం సహించదని, ఇది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దశాబ్దాల పోరాటాలు, ఎన్నెన్నో ప్రాణ త్యాగాల పునాదుల మీద ఉద్భవించిన తెలంగాణ రాష్ట్రం పన్నెండేళ్లు పూర్తి చేసుకుని, పదమూడో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అత్యంత వైభవోపేతంగా జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ.. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వినూత్న పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు. పాలనా పగ్గాలు చేపట్టిన గత 30 నెలల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతమయ్యామని, భవిష్యత్ తెలంగాణ అభివృద్ధి కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామని ఆయన ఈ వేదికపై నుంచి ఉద్ఘాటించారు.
**అమరుల త్యాగాలకు ఘన నివాళి… సోనియా, మన్మోహన్లకు కృతజ్ఞతలు**
ప్రజా కవి కాళోజీ నారాయణరావు రచించిన ‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అనే స్ఫూర్తిదాయక వాక్యాలను ఉటంకించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర హితం కోసమే తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఉద్ఘాటించారు. పరేడ్ గ్రౌండ్స్ వేడుకల కంటే ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కలను సాకారం చేయడంలో ఆనాడు కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి యావత్ తెలంగాణ సమాజం తరఫున ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని పాలనగా కాకుండా ఒక పవిత్రమైన బాధ్యతగా భావిస్తున్నామని, కొద్దిమంది చేతుల్లో అధికారం బందీ కాకూడదనే ఉద్దేశ్యంతోనే నాలుగు కోట్ల ప్రజల ప్రతినిధిగా తమ వ్యవస్థ పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
**రైతుల అభ్యున్నతికే పెద్దపీట**
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర లక్ష్యంతో అడుగులు వేస్తున్నామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైందని వివరించారు. అన్నదాతల అప్పుల బాధను తీర్చేందుకు ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ అమలు చేశామని, ఈ క్రమంలో దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తూ 20,616 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు 27,529 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న దృఢ సంకల్పంతో గత రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్ల కోసమే 82,840 కోట్ల రూపాయలు వెచ్చించామని, యాసంగి సీజన్లో దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 60 శాతం తెలంగాణ నుంచే ఉండటం రాష్ట్ర వ్యవసాయ శక్తికి నిలువెత్తు నిదర్శనమని ఆయన కొనియాడారు.
**విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు**
యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకుండా అత్యంత పారదర్శకంగా 67,763 ఉద్యోగాలను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలతో పాటు మెగా డీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులకు మరింత శుభవార్త చెబుతూ, ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), అటవీశాఖ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించే పథకంతో పాటు, జూనియర్ కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
**ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం**
పేదలకు సొంతింటి కల నెరవేరడం మాటల్లో చెప్పలేని ఆనందాన్నిస్తుందని, వారిని అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొదటి ఏడాదే 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. కేవలం 13 నెలల వ్యవధిలోనే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసి పేదల సొంతింటి కలను సాకారం చేశామని, సెప్టెంబర్ 17 నాటికి మరో రెండు లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా క్యూర్ పరిధిలో ఈసారి లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు.
*మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి**
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశ్యంతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఒక లక్ష కోట్ల రూపాయల రుణాలు అందించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని, ఇప్పటికే 60 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించామని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళా శక్తి భవనాల నిర్మాణం వంటి పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో తోడ్పడుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
**ఆరోగ్య రంగానికి భారీ పెట్టుబడులు**
దేశ చరిత్రలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని సీఎం వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించడంతో పాటు, ఎస్సీ ఉపవర్గీకరణను సైతం పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం వైద్య రంగానికి 11 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించామన్నారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంతో పాటు 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినట్లు గుర్తు చేశారు.
**లక్ష్యం ఒక్కటే…తెలంగాణ రైజింగ్-2047**
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్‌గా మార్చడంతో పాటు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని భారీ తయారీ పరిశ్రమల కేంద్రంగా, మిగతా ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత అభివృద్ధి మండలాలుగా తీర్చిదిద్దుతామన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ఏకంగా మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలబెట్టడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఒక గేట్వేగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం ఒక పత్రం కాదని, రాబోయే తరాల భవిష్యత్తును నిర్మించే ఒక మహత్తర కార్యాచరణ అని ఆయన ఉద్ఘాటించారు. ఈ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
**రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు**
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీల నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఖమ్మం గ్రౌండ్స్‌లో జరిగిన భారీ వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో ఉదయాన్నే వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శాసనసభ, శాసనమండలిలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.








