పాక్ కుట్రలకు చెక్..
* దాయాది గుండెల్లో గుబులు రేపుతున్న అమిత్ షా ‘కచ్’ వ్యూహం.
ఢిల్లీ, మహా.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, నిత్యం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశం పాకిస్థాన్ ఆటలు ఇక సాగవు. ఆ దేశపు దారుణాలకు, కుటిల యత్నాలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు నవ భారతం సరికొత్త పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసింది. రక్షణ రంగంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే, సరిహద్దు భద్రతను ఉక్కుకోటలా మార్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. తాజాగా ఆయన పశ్చిమ సరిహద్దుల్లో పర్యటించి, సైన్యానికి దిశానిర్దేశం చేసిన తీరు.. పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తూ, అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
**సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నజర్.. ‘హరామీ నాలా’లో అమిత్ షా పర్యటన**
గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన ‘హరామీ నాలా’, ‘సర్ క్రీక్’ ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఇప్పుడు సరిహద్దు రాజకీయాల్లో వేడి రగిలిస్తోంది. భౌగోళికంగా ఈ ప్రాంతాలు పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటాయి. ముఖ్యంగా హరామీ నాలా ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన చిత్తడి నేలలతో కూడుకుని ఉంటుంది. అడుగడుగునా విషసర్పాలు, తేళ్లు సంచరించే ఈ అత్యంత ప్రతికూల వాతావరణంలో మన సైనికులు అహర్నిశలు పహారా కాస్తున్నారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఈ భూభాగంపై పూర్తి స్థాయి వ్యూహాత్మక పట్టు సాధించే దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోదనడానికి తాజా పర్యటనే నిదర్శనం. శత్రువు ఊహకు కూడా అందని రీతిలో వ్యూహరచన చేయడంలో దిట్ట అయిన అమిత్ షా.. ఈ చిత్తడి నేలల నుంచే పాక్ ఉగ్ర కుట్రలకు చెక్ పెట్టే మాస్టర్ స్కెచ్ వేశారు.
**సరిహద్దుల్లో మౌలిక వసతుల బలోపేతం.. సీక్రెట్ ఆపరేషన్ సమీక్ష**
తన పర్యటనలో భాగంగా దేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లను హోం మంత్రి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. సరిహద్దుల్లో గస్తీ కాసే దళాల కోసం కొత్తగా నిర్మించిన ‘బోర్డర్ అవుట్ పోస్ట్ (బీఓపీ) జి7’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ‘ఓపీ టవర్ 1170’లోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, సర్ క్రీక్ జలాల్లో పడవ ద్వారా కలియదిరిగారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జెట్టీ పాయింట్ వద్ద మొక్కలు నాటిన అనంతరం.. భుజ్ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ సెక్టార్ ప్రధాన కార్యాలయంలో సైనికాధికారులతో అత్యంత రహస్యంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన ఆరు నెలల కాలంలోనే (గత నవంబర్‌లో బీఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలతో కలుపుకుని) అమిత్ షా కచ్ ప్రాంతానికి రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ రహస్య భేటీలో సైనికాధికారులకు ఇచ్చిన సూచనలు, తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తు సరిహద్దు భద్రతా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
**ఉక్కు కంచె.. వణికిపోతున్న దాయాది**
అమిత్ షా పకడ్బందీ వ్యూహాలతో పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సరిహద్దుల్లో భారత్ భారీ సైనిక, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టడం దాయాదిలో తీవ్ర ఆందోళన పెంచుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ భవిష్యత్తులో తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ ఏంటో అర్థంకాక పాకిస్థాన్ దళాలు భయంతో సరిహద్దులను నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా కచ్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో అత్యంత కీలకమైన ఎయిర్ బేస్‌ల నిర్మాణం శరవేగంగా సాగుతున్న సమయంలో హోం మంత్రి స్వయంగా అక్కడ పర్యవేక్షించడం వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.







