మంగ్లీ మెడకు మరో ఉచ్చు..
* నెట్టింట భగ్గుమంటున్న తెలంగాణ సమాజం.
*ఉద్యమ పాటకు అపహాస్యం.. ఐటెం సాంగ్‌లా చిందులేస్తూ గానం.
*అమరుల త్యాగాలను కించపరిచేలా ప్రవర్తనపై నెటిజన్ల ఆగ్రహం.
* బహిరంగ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్.
హైదరాబాద్, మహా.
వరుస వివాదాలతో సతమతమవుతున్న ప్రముఖ గాయని మంగ్లీకి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారాలు, అధిక వడ్డీ మోసాల ఆరోపణలతో ఇప్పటికే ఆమె పేరు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఆ పాత వివాదాల సెగ ఇంకా చల్లారకముందే, తాజాగా ఆమె మెడకు మరో కొత్త వివాదం చుట్టుకుంది. తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలకు, నెత్తుటి గాయాలకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక భావోద్వేగ భరితమైన గీతాన్ని ఆమె ఆలపించిన తీరు ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తీవ్రస్థాయిలో కలచివేస్తోంది. నెటిజన్లు ఆమె తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.
**అమరుల త్యాగాలకు చిందులా..?**
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజాకవి గూడ అంజయ్య కలం నుంచి జాలువారిన అద్భుతమైన గీతం “బండెనుక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి”. ‘మా భూమి’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట.. అప్పట్లో తెలంగాణ సమాజంలో ఒక అతిపెద్ద ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. నాటి నెత్తుటి త్యాగాలను గుర్తుచేస్తూ, ప్రతి తెలంగాణ బిడ్డ గుండెను బరువెక్కించే ఎమోషన్ ఈ పాటలో ఇమిడి ఉంది. అయితే, అటువంటి పవిత్రమైన గీతాన్ని కొద్దికాలం క్రితం జరిగిన ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌లో మంగ్లీ ఆలపించిన విధానం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. ఆ పాట వెనుకున్న అమరవీరుల త్యాగాలను, అంతరార్థాన్ని పూర్తిగా పక్కనబెట్టి.. క్లబ్బుల్లో, పబ్బుల్లో పాడే ఐటెం సాంగ్ తరహాలో డ్యాన్స్ చేస్తూ, ఊగిపోతూ, వెటకారపు నవ్వులతో ఆమె పాడటం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది.
**అవతరణ దినోత్సవం వేళ వెలుగులోకి..**
నిజానికి మంగ్లీ పాల్గొన్న ఈ స్టేజ్ ప్రోగ్రామ్ పాతదే అయినప్పటికీ.. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా తెరపైకి తీసుకువచ్చారు. ఆ పాత వీడియో కాస్తా ఇప్పుడు నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది. పాటలోని ప్రతి అక్షరం వెనక తెలంగాణ అమరవీరుల రక్తం కనిపిస్తుంటే.. స్టేజ్ పైన మంగ్లీ వేసిన ఆ గంతులు ఏంటి? ఆ వెటకారపు నవ్వులు ఏంటి? అంటూ నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక గాయనిగా పాటలోని భావాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం క్షమించరాని నేరమని మండిపడుతున్నారు.
**క్షమాపణలు చెప్పాల్సిందే..**
తెలంగాణ ఉద్యమ చరిత్రను, పాటల ప్రాధాన్యతను అవమానించేలా ప్రవర్తించినందుకు గానూ.. మంగ్లీ తక్షణమే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ, ఇలా పదే పదే వివాదాల్లో చిక్కుకోవడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నలువైపుల నుంచి ముంచుకొస్తున్న ఈ తాజా వివాదంపై మంగ్లీ ఏ విధంగా స్పందిస్తారో, తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ఎలా చల్లారుస్తారో వేచి చూడాలి.








