Mahaa Daily Exclusive

  బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు ‘టీజీ రెరా’ అల్టిమేటం..

Share

బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌కు ‘టీజీ రెరా’ అల్టిమేటం.
* 60 రోజుల్లో వసతులు పూర్తి చేయాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు.
* బాలాజీ ఎలిగాన్సియా’ డెవలపర్‌కు రెరా స్పష్టమైన ఆదేశాలు.
* కొనుగోలుదారుల పక్షాన నిలిచిన అథారిటీ.. చారిత్రాత్మక తీర్పు.
హైదరాబాద్, మహా.
విలాసవంతమైన వసతులు కల్పిస్తామని నమ్మబలికి, తీరా విల్లాలు విక్రయించాక ముఖం చాటేస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఆటలు ఇక సాగవని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) స్పష్టం చేసింది. కొనుగోలుదారుల హక్కులను కాలరాస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఓ కీలక తీర్పును వెలువరించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో ‘బాలాజీ ఎలిగాన్సియా’ పేరిట విల్లా ప్రాజెక్టును చేపట్టిన డెవలపర్ ‘మెసర్స్ బాలాజీ కన్‌స్ట్రక్షన్స్’కు రెరా గట్టి షాకిచ్చింది. ప్రాజెక్టులో అసంపూర్తిగా వదిలేసిన మౌలిక సదుపాయాలు, ఉమ్మడి వసతులను కేవలం 60 రోజుల్లోగా పూర్తి చేయాలని డెవలపర్‌ను ఆదేశిస్తూ కఠినమైన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోటర్ల జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం-2016 నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని ఈ తీర్పు ద్వారా అథారిటీ తేల్చిచెప్పింది.
బాలాజీ ఎలిగాన్సియా ప్రాజెక్టులో విల్లాలు కొనుగోలు చేసిన వినియోగదారులు.. బాలాజీ ఎలిగాన్సియా విల్లా ఓనర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ మెయింటెనెన్స్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెరాను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్రోచర్లు, సేల్ అగ్రిమెంట్లలో డెవలపర్ ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ క్షేత్రస్థాయిలో అవి అమలు కాలేదని కొనుగోలుదారులు తమ ఫిర్యాదు (నెం. 375/2025)లో పేర్కొన్నారు. పూర్తిస్థాయి క్లబ్ హౌస్, మురుగునీటి శుద్ధి కేంద్రం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, వంద శాతం పవర్ బ్యాకప్, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అథారిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన రెరా.. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ద్వారా థర్డ్-పార్టీ భౌతిక తనిఖీని చేయించింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. అప్పటికే చాలా విల్లాలు అమ్ముడుపోయి, ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ ప్రాథమిక పౌర సదుపాయాలు, ఉమ్మడి వసతుల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయని ఈఎస్‌సీఐ నిపుణుల బృందం నిర్ధారించింది. వాస్తవానికి 2024 సెప్టెంబర్ 1 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉన్నా, పనులు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై డెవలపర్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను, సాకులను అథారిటీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రాజెక్టు గడువు పొడిగింపులో ఉందని, రెసిడెంట్స్ అసోసియేషన్‌కు చట్టపరమైన గుర్తింపు లేదంటూ డెవలపర్ చేసిన వాదనలను రెరా చట్టంలోని సెక్షన్ 37, 38 కింద లభించిన అధికారాలతో అథారిటీ కొట్టివేసింది. ప్రాజెక్టులో మూడింట రెండొంతుల (2/3) కంటే ఎక్కువ ఇళ్లలో ఇప్పటికే కొనుగోలుదారులు నివాసం ఉంటున్నప్పుడు, వాగ్దానం చేసిన అన్ని మౌలిక సదుపాయాలను అందించాల్సిన బాధ్యత డెవలపర్‌పై ఎంతైనా ఉంటుందని ఈ చారిత్రక తీర్పులో రెరా స్పష్టం చేసింది. ఈ బాధ్యత నుంచి డెవలపర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని, ఇది నాన్-నెగోషియబుల్ అని తేల్చిచెప్పింది.
ఈఎస్‌సీఐ ప్యానెల్ ముందు డెవలపర్ స్వయంగా అంగీకరించిన గడువులోగా పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి వసతులన్నింటినీ తప్పనిసరిగా పూర్తి చేయాలని అథారిటీ ఆదేశించింది. ముఖ్యంగా, ఇప్పటికే గడువు ముగిసిన మౌలిక సదుపాయాల పనులను మాత్రం ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి కచ్చితంగా 60 రోజుల్లోగా పూర్తి చేయాలని డెవలపర్‌కు కచ్చితమైన డెడ్‌లైన్ విధించింది. ఒకవేళ అథారిటీ జారీ చేసిన ఈ గడువును ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. ఏమాత్రం జాప్యం చేసినా చట్టంలోని సెక్షన్ 63 కింద ప్రమోటర్‌పై కఠినమైన శిక్షాత్మక చర్యలు, చట్టపరమైన ప్రాసిక్యూషన్ ఆటోమేటిక్‌గా ప్రారంభమవుతుందని టీజీ రెరా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పూర్తి పారదర్శకతను తీసుకురావడం, వినియోగదారుల హక్కులను కాపాడటమే తమ ప్రథమ కర్తవ్యమని ఈ ఉత్తర్వుల ద్వారా రెరా మరోసారి స్పష్టం చేసింది.