Mahaa Daily Exclusive

  ఉత్తర తెలంగాణకు మహర్దశ….

Share

ఉత్తర తెలంగాణకు మహర్దశ.
* రూ.7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ.
* ఆర్మూర్-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్ మార్గాలకు మోక్షం.
*కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.
* హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
* 77 లక్షల పనిదినాలతో ఉపాధి కల్పన, ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలకు మెరుగైన అనుసంధానం.

ఢిల్లీ, మహా.

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేలా సుమారు రూ. 7,597.16 కోట్ల భారీ అంచనా వ్యయంతో 190.76 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ ప్రాజెక్టే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రికి, కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
**రెండు కీలక మార్గాలు.. నాలుగు వరుసలుగా విస్తరణ**
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రధాన జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా (4-లేన్స్) విస్తరించనున్నారు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలను అనుసంధానించే 63వ నంబరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-63) లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అలాగే జగిత్యాల, కరీంనగర్ జిల్లాలను కలిపే 563వ నంబరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563) లోని జగిత్యాల-కరీంనగర్ మార్గాన్ని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (బోట్-టోల్) పద్ధతిలో విస్తరించనున్నారు.
**బైపాస్‌లతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు**
ప్రస్తుతం ఈ రహదారులు అంకాపూర్, కోరుట్ల, ధర్మపురి, గంగాధర వంటి అత్యంత జనసాంద్రత, నిరంతర రద్దీ ఉండే పట్టణ ప్రాంతాల గుండా వెళ్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు ఆయా రద్దీ ప్రాంతాల్లో కొత్తగా బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. తద్వారా వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నిరాటంకంగా ప్రయాణించేలా ఓపెన్ టోలింగ్ సౌకర్యంతో ఈ రహదారులను అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు.
**ఆదా కానున్న ప్రయాణ సమయం.. పర్యావరణానికి మేలు**
ఈ భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత ఆర్మూర్ – మంచిర్యాల మధ్య దాదాపు గంటన్నర (1 గంట 30 నిమిషాలు), జగిత్యాల – కరీంనగర్ మధ్య దాదాపు 45 నిమిషాల ప్రయాణ సమయం కలసిరానుంది. ఇది వాహనాల నిర్వహణ ఖర్చులను, ఇంధన వినియోగాన్ని పెద్ద ఎత్తున తగ్గించడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర హాని చేసే కార్బన్ ఉద్గారాలను సైతం నియంత్రిస్తుంది.
**’పీఎం గతిశక్తి’తో సమగ్ర అభివృద్ధి.. భారీగా ఉపాధి అవకాశాలు**
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘పీఎం గతిశక్తి’ సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ రహదారులు అనేక ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం కల్పించనున్నాయి. వరంగల్, సిద్దిపేట సెజ్‌లతో పాటు నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్ వంటి ఐదు ప్రధాన ఆర్థిక కేంద్రాలను, అలాగే వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం వంటి ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఈ మార్గాలు కలుపుతాయి. వీటితో పాటు వివిధ రైల్వే స్టేషన్లతో కూడిన పది లాజిస్టిక్స్ కేంద్రాలను సైతం ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాయి. దీనివల్ల సరుకు రవాణా వేగవంతమై దేశ లాజిస్టిక్స్ పనితీరు మెరుగుపడుతుంది. ప్రాజెక్టు నిర్మాణ దశలో స్థానికంగా సుమారు 77 లక్షల పనిదినాల (మ్యాన్-డేస్) మేర ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా తెలంగాణ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన పత్రికా ప్రకటనలో సవివరంగా పేర్కొన్నారు.