ఎందుకీ విద్వేషం..
ఏమిటీ ఈ ద్వేషం… ఎందుకు ఈ విద్వేషం…. ఎప్పటికి ఆగుతాయి ఈ విమర్శలు… ఎప్పుడు ఆపుతారు ఈ ఆరోపణలు.. తెలంగాణ ఏర్పాటు అయి 12 సంవత్సరాలు అయినా ఇంకా ఆంధ్రా, తెలంగాణ వాదం మాత్రం సమసి పోవటం లేదు.. తెలంగాణ సాధన కోసం అమరులైన బిడ్డల త్యాగాలు ఇంకా కళ్ల ముందే నిలుస్తున్నాయి… తెలంగాణ ఉద్యమం ఓ స్ఫూర్తిదాయక ఘట్టం. ఇది అందరు ఒప్పుకుని తీరాల్సిందే… ఇప్పుడు కావాల్సింది ప్రాంతీయ వాదం ఎంతమాత్రం కాదు… వృద్ధి… అభివృద్ధి. ఇందులో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడాలి… ప్రగతి వైపు రాష్ట్రాలను పరుగులు తీయించి దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలను అగ్ర భాగానా నిలపాలి… ఈ విషయం పై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టాల్సిన వేళ ఇది.. అంతేకానీ మళ్ళీ ప్రాంతీయవాదం తెర పైకి తెచ్చి రాజకీయ లబ్దికోసం ప్రాకులాటలు సాగిస్తే తెలుగుజాతి పేరు, ప్రతిష్టలు దిగజారే ప్రమాదం వుంది… ఈ విషయం ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలకు తెలియనిది కాదు… అయినా రచ్చ చేయటం ఓ పనిగా పెట్టుకున్నారు… తెలంగాణ జనాల దిష్టి తగిలి కోనసీమ వెలవెలబోతోంది అంటూ ఒకరు, తెలంగాణలో ఆంధ్ర వారికీ చోటు లేదని మరొకరు… ఇలా మొదలు అవుతున్న వివాదాలు చివరికి ఎక్కడ వరకు వెడతాయి అనేది ఎవ్వరికి పట్టట్లేదు… అసలు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ వాదం ఇప్పుడు మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు అనేది కాస్త నిశితం గమనిస్తే అది కేవలం రాజకీయ స్వార్ధం కోసమే అన్న అసలు నిజం ప్రతీ ఒక్కరికి బోధ పడుతుంది… నిజానికి తెలంగాణలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ లో వున్న. తెలంగాణ వాసులకు నూటికి నూరు శాతం ప్రాంతీయ వాదం లేదు… వారి మధ్య వున్నది స్నేహం, సన్నిహితం, బంధుత్వం మాత్రమే… తెలుగుజాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అంటూ సీ. నారాయణ రెడ్డి అన్న పలుకులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలోని రాజకీయ పార్టీ నేతలు ఒకటికి వంద సార్లు నిత్యం పాడుకోవాల్సిందే… రాజకీయ మనుగడ కోసం, పార్టీల అస్తిత్వం కోసం ప్రాంతీయ వాదం రెచ్చగిట్టటం, అది తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభిప్రాయంగా పార్టీల నేతలు చెప్పుకోవటం పరిపాటిగా మారింది… నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నది అభివృద్ధి… ఉపాధి… విద్యా, వైద్యం… కూడు, గూడు… అంతే గాని ప్రాంతాల వారీగా విభేదాలు ఏ ఒక్కరు కోరుకోవడం లేదు అన్నది బహిరంగ రహస్యం..
ఇప్పుడు వివాదాలు తారా స్థాయికే చేరుకున్నాయి… అయ్యా జాగీరులను ప్రశ్నించుకునే స్థాయికి చేరుకున్నాయి… ఏ రాష్ట్రం ఏ పార్టీకి శాశ్వతం కాదు… ఇది ప్రజాస్వామ్య విధానం… తమకు ఎవరు పాలకులుగా ఉండాలో ప్రజలు ఓటు ద్వారా స్పష్టంగా చెప్పేసి అధికారం ఇస్తున్నారు… ఇక అలాటప్పుడు ఏ రాష్ట్రం ఎవరీ జాగీరు…? ఇది రాజకీయ నేతలకు తెలీదా? తెలుసు… తెలిసే ఈ నాటకాలు చేయటం, రక్తి కట్టించే దిశగా వాటిని లాగటం పార్టీ నేతలకు ఓ అలవాటుగా మారింది… తాజాగా సాగుతున్న ప్రాంతీయ వాదం కూడా ఇందులో భాగమే… రాజకీయ ప్రయోజనం కోసం ప్రాంతీయ వాదాన్ని ఆయుధంగా పెట్టటం ఇప్పుడు అత్యంత సులభంగా నేతలకు మారింది… ఇక దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావాలు వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది… అందుకు పరిమితులు కూడా వున్నాయి…సభలు, సమావేశాలు… ర్యాలీలు… ధర్నాలు ఇలా వివిధ కార్యక్రమాలు చేసుకునేందుకు రాజకీయ పార్టీలకు ఓ విధానం వుంది… ప్రజలకు ఇబ్బంది లేని వాటిని గుర్తించి వాటి నిర్వహించడం కోసం పోలీసులు అనుమతి కూడా ఇస్తారు… అయితే ఆయా పార్టీలు, సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసే సమావేశాలు, సభలు ఇతరాల వల్ల శాంతి, భద్రతల సమస్య వచ్చే పరిస్థితి ఉంటే వాటిని అనుమతించక పోవటం సర్వ సాధారణ అంశం… ఇక ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ నవ తెలంగాణ నిర్మాణం అంటూ సభ ఏర్పాటు చేసే ఆలోచన మరోసారి ప్రాంతీయ వాదం వరకు వెళ్లి ఇప్పుడు ఇదే రొచ్చుగా మారింది… ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు… కోర్టు కూడా నో అనేసింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసి పోతే ఇబ్బంది లేకుండా పోయేది… కానీ రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు, సవాళ్లు, విమర్శలు, ఆరోపణల వరకు చేరి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొని వచ్చింది… ఇప్పటికి ఇప్పుడు కొంపలంటుకునే దుస్థితి లేక పోయినా ప్రజల ప్రశాంత జీవనం పైన ఇది ప్రభావం చూపేలా తయారు అవుతోంది… బతుకు తెరువు కోసం వచ్చిన వారికి ఇది సంకటమే అన్నది మేధావుల అభిప్రాయం… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ప్రాంతీయ భావం దూరం అయింది అనుకుంటున్న ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చిరాకు పుట్టిస్తున్నాయి… ఇవి అభివృద్ధికి గొడ్డలి పెట్టులాంటివే అంటున్నారు వాళ్ళు… ఎవరి రాష్ట్రం పై వారికి అభిమానం ఉంటుంది… ఇది సహజం… దేశభక్తి అంటే ప్రాంతీయ వాదం కాదు… అదో గౌరవభావం… ఆత్మ నిబద్దత… ఇది తెలిసి కూడా ప్రాంతీయ తత్వం పై రాజకీయం చేయటం అవివేకం. ప్రజలకు కావాల్సింది బతుకేందుకు ఓ మార్గం… అది చూపే దిశగా మాత్రమే నేతలు ప్రయత్నం చేస్తే అది శాశ్వత బలం అవుతుంది… అంతేకానీ ఎవరి జాగీరు కానీ వాటి కోసం రచ్చ చేసి రొచ్చు రాజకీయం నడిపితే చివరికు తగిన మూల్యం ప్రజల నుంచి అందుకోవాల్సి వస్తుంది… ప్రాంతీయ వాదన వదిలి సమతా వాదన వైపు ఇప్పుడు నేతలు అడుగు వేస్తే అదే తెలుగు రాష్ట్రాలకు పెన్నిధి అవుతుంది…
జీ. వెంకటరమణ…
సీనియర్ జర్నలిస్ట్








