Mahaa Daily Exclusive

  జనసైనికుల నుంచే సరికొత్త నాయకత్వం….

Share

జనసైనికుల నుంచే సరికొత్త నాయకత్వం.
*జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం.
*క్షేత్రస్థాయి నాయకులకు బాధ్యతలు.
* 15 ఏళ్ల పవన్ కల్యాణ్ ఆలోచనకు కార్యరూపం.
* సంస్థాగత నిర్మాణం, యువ నాయకత్వమే లక్ష్యంగా వినూత్న అడుగులు.
అమరావతి, మహా.
జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక అడుగు వేశారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా, అంకితభావంతో పనిచేస్తున్న జనసైనికులకు సముచిత స్థానం, బాధ్యతలు కల్పించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ‘జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను’ నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసైనికుల నుంచే భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే ఒక వినూత్న ప్రక్రియకు ఈ కమిటీల ద్వారా శ్రీకారం చుట్టారు. దశాబ్దన్నర క్రితమే రూపుదిద్దుకున్న పవన్ కల్యాణ్ ఆలోచనకు ఈ నూతన కమిటీల ద్వారా కార్యరూపం దక్కినట్లయింది.
ఈ కమిటీల కూర్పును పవన్ కల్యాణ్ స్వయంగా సమీక్షించి ఆమోదముద్ర వేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 28 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు కలిపి మొత్తం ఏడుగురు ప్రధాన సభ్యులుగా ఉంటారు. వారితో నిరంతరం సమన్వయం చేస్తూ పనిచేసేందుకు మరో 21 మంది సాధకులను ఇందులో నియమించారు. ప్రతి కమిటీకి పరిశీలకులుగా సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించగా, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వీరమహిళలకు సైతం ఈ కమిటీల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, జనసైనికుడికి తగిన గుర్తింపు లభించాలన్నదే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకుల సేవలు, వారి నాయకత్వ లక్షణాలు, పార్టీ పట్ల వారు ప్రదర్శిస్తున్న అంకితభావం తదితర కీలక అంశాలపై ఈ కమిటీలు నిశితంగా సమాచారాన్ని సేకరిస్తాయి. అనంతరం ఆ సమగ్ర నివేదికను పార్టీ అధ్యక్షుల పరిశీలనకు సమర్పిస్తాయి. కమిటీలు సేకరించిన ఈ సమాచారాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించి, ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కార్యకర్తలకు తగిన పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయిన తరుణంలో నాయకుల్లో వచ్చిన పరిణతికి ఈ ప్రక్రియ అద్దం పడుతోంది. ఎన్నో కష్టాలు, పోరాటాలను అధిగమించిన జనసైనికులు నేడు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, క్షేత్రస్థాయిలో సంస్థాగత బాధ్యతలు చేపట్టడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. కుల, మత, వంశపారంపర్య, బుజ్జగింపుల రాజకీయాలకు నేటి జెన్‌జెడ్ తరం పూర్తిగా విసిగిపోయిందని, జవాబుదారీతనంతో కూడిన పారదర్శక రాజకీయాలను తీసుకొచ్చే నాయకుల కోసం యువత ఎదురుచూస్తోందని పవన్ కల్యాణ్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ తరుణంలో పటిష్టమైన నవభారత నిర్మాణం కోసం, చైతన్యవంతమైన పౌరులను నాయకులుగా తీర్చిదిద్దుతూ క్షేత్రస్థాయి నుంచి యువత చేతుల్లోనే సరికొత్త రాజకీయాలకు జనసేనాని నాంది పలుకుతుండటం విశేషం.