Mahaa Daily Exclusive

  ఉన్నత విద్యావంతులకు సుప్రీంకోర్టు భారీ షాక్….

Share

ఉన్నత విద్యావంతులకు సుప్రీంకోర్టు భారీ షాక్.
* ఎక్కువ చదివితే ఆ ఉద్యోగాలకు అనర్హులే.
* నిరుద్యోగుల ఆశలపై సుప్రీం నీళ్లు.
* డిగ్రీ ఉంటే టెన్త్ ఉద్యోగం అడగొద్దు.
* ఓవర్ క్వాలిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు.
* అర్హుల నోటికాడ కూడు లాక్కోవద్దు.
* ప్రభుత్వ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.
* నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న తాజా తీర్పు.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న కోట్లాది మంది నిరుద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. చేతిలో ఉన్నత విద్యా పత్రాలు ఉంటే చాలు, ఏ చిన్న ఉద్యోగానికైనా దరఖాస్తు చేసుకుని సులభంగా స్థిరపడిపోవచ్చు అనుకునే నిరుద్యోగుల ఆశలపై న్యాయస్థానం నీళ్లు చల్లింది. నోటిఫికేషన్లో అడిగిన అర్హతల కంటే ఎక్కువ చదువుకున్న అభ్యర్థులు, ఆయా పోస్టులకు అనర్హులని సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఏళ్ల తరబడి గ్రూప్స్ లాంటి ఉన్నత ఉద్యోగాలకు సన్నద్ధమవుతూనే, దొరికిన చిన్న ఉద్యోగంతో నెట్టుకురావాలని భావించే నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై ఎవరైనా సరే కేవలం తమ విద్యా అర్హతలకు సరితూగే ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
**సిండికేట్ బ్యాంక్ అటెండెంట్ వ్యవహారంతో మొదలైన రగడ**
సుప్రీంకోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు వెనుక సిండికేట్ బ్యాంకుకు చెందిన ఒక ఉద్యోగ నియామక వివాదం దాగి ఉంది. సిండికేట్ బ్యాంకులో తాత్కాలిక బ్యాంక్ అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు గరిష్ట విద్యార్హత 10వ తరగతిగా నిర్ణయించారు. అయితే ఒక అభ్యర్థి తాను డిగ్రీ పూర్తి చేసినప్పటికీ, ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి, కేవలం పదవ తరగతి సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుని ఎంపికయ్యాడు. తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో వివాదం న్యాయస్థానం మెట్లు ఎక్కింది. ఉన్నత విద్యను దాచిపెట్టి ఉద్యోగం పొందడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఇది ఎంపిక ప్రక్రియలోని నిష్పక్షపాతాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
**అర్హుల నోటికాడ కూడు లాక్కోవడమే..**
తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వాలు కొన్ని పోస్టులను వారికి కేటాయిస్తాయని న్యాయస్థానం గుర్తుచేసింది. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయి అర్హతతో భర్తీ చేసే అటెండెంట్, వాచ్‌మెన్, స్వీపర్ లాంటి పోస్టులకు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు పోటీ పడితే, అసలు ఆ పోస్టులు ఎవరి కోసం ఉద్దేశించబడ్డాయో ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎక్కువ చదువుకున్న వారు పోటీలో ఉండటం వల్ల, తక్కువ చదువుకున్న అసలైన అర్హులు ఉద్యోగావకాశాలు కోల్పోతారని, ఇది వారి అవకాశాలను లాక్కోవడమేనని అత్యున్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
**ప్రభుత్వం నిష్పక్షపాతమైన యజమానిగా వ్యవహరించాలి**
ప్రభుత్వ నియామకాల విషయంలో రాజ్యం ఒక నిష్పక్షపాతమైన యజమాని పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. నియామక ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు లభించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ.. ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్న నిబంధనలను, అర్హతలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించింది. ఉన్నత విద్యార్హత కలిగి ఉండటం అనేది ఒక అదనపు అలంకారం కావొచ్చేమో కానీ, తక్కువ విద్యార్హత అవసరమైన పోస్టులకు దరఖాస్తు చేసుకునే హక్కును ఏమాత్రం కల్పించబోదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తాజా తీర్పుతో వాస్తవాలను దాచిపెట్టి తక్కువ స్థాయి కొలువుల్లో చేరిన వారి పరిస్థితి, భవిష్యత్తులో దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.