Mahaa Daily Exclusive

  నిధుల కోసమే పాక్ డ్రామాలు….

Share

నిధుల కోసమే పాక్ డ్రామాలు.
* ట్రంప్‌నకు షెహబాజ్ షరీఫ్ భజన.
* భారత సైన్యం దెబ్బకు వణికిపోయి.. ఇప్పుడు అమెరికాకు ప్రశంసలు.
* గతేడాది కాల్పుల విరమణకు ట్రంపే కారణమన్న పాక్ ప్రధాని.
*ఆ వాదనను గతంలోనే కొట్టిపారేసిన భారత విదేశాంగ శాఖ.
* ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు దిగివచ్చింది పాకిస్థానే.
ఢిల్లీ, మహా.
భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు ప్లేటు మార్చింది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, నిధుల కోసం అగ్రరాజ్యం ముందు మోకరిల్లుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆకాశానికెత్తేస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సరికొత్త డ్రామాలకు తెరతీశారు. గతేడాది (2025) మే 10న భారత్‌తో జరిగిన కాల్పుల విరమణకు ట్రంప్ చేసిన ‘సమయానుకూల, నిర్ణయాత్మక జోక్యమే’ కారణమని, ఆయన్ను తాము ఎప్పటికీ ‘శాంతిదూత’గా గుర్తుపెట్టుకుంటామని షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, అమెరికా నుంచి ఆర్థిక సాయం దండుకునేందుకే షరీఫ్ ఇలాంటి భజన కార్యక్రమాలకు పూనుకున్నారని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న అమానుష దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం 2025 మే 7వ తేదీన పాక్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం విదితమే. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత వైమానిక దళం పాక్ గడ్డపైకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను, స్థావరాలను ఊచకోత కోసింది. భారత సైన్యం సృష్టించిన ఈ విధ్వంసాన్ని తట్టుకోలేక పాక్ ఆర్మీ అక్షరాలా చేతులెత్తేసింది. ఆ దెబ్బకు తాళలేక పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్వయంగా భారత సైనిక అధికారులకు ఫోన్‌ చేసి, ప్రాధేయపడి మరీ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు.
కానీ, వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ క్రెడిట్ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తుండటం, దానికి పాక్ ప్రధాని వంతపాడటం గమనార్హం. తాను మధ్యవర్తిత్వం వహించి ఈ యుద్ధాన్ని ఆపేశానని, ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తుండగా, షరీఫ్ దానికి అవునంటూ తలాడిస్తున్నారు. అయితే, వీరిద్దరి వాదనలకు భారత విదేశాంగ శాఖ గతంలోనే గట్టిగా చెక్ పెట్టింది. ఈ వ్యవహారంలో అసలు మూడో దేశం ప్రమేయమే లేదని, పాక్ సైన్యమే స్వయంగా కాల్పుల విరమణ కోరిందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అత్యంత స్పష్టంగా తేల్చిచెప్పారు.