రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం.
* దేశంలో ఎలాంటి ‘ఆర్థిక సునామీ’ లేదు!
*కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థల నిర్వీర్యం.
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం.
ఢిల్లీ, మహా.
భారత ఆర్థిక వ్యవస్థపై, అత్యున్నత స్థాయి సంస్థల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఆటంకాలను తట్టుకునే వ్యవస్థలైన ‘షాక్ అబ్జార్బర్ల’ను తొలగించడం వల్ల దేశం “ఆర్థిక సునామీ” దిశగా పయనిస్తోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల్లో లేని భయాందోళనలను సృష్టించేందుకే ఆయన ఇలాంటి అసత్యపు ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఆ షాక్ అబ్జార్బర్లను నిజంగానే తొలగించి ఉంటే, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియాలో సంక్షోభం, సరఫరా గొలుసులో అంతరాయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంత నిలకడగా ఎలా కొనసాగుతోందని ఆయన సూటిగా ప్రశ్నించారు. బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మోదీ నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల సహకారంతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు.
**గణాంకాలే మన ఆర్థిక బలానికి నిదర్శనం**
దేశ ఆర్థిక పురోగతిని తెలిపే తాజా గణాంకాలు రాహుల్ ఆరోపణలను పటాపంచలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ఆర్థిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తూ ఏప్రిల్, 2026లో 11.8 శాతంగా ఉన్న ఇ-వే బిల్లుల జారీ, మే నెలలో 12.9 శాతానికి వృద్ధి చెందిందన్నారు. తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతూ మే నెలలో 56.6 పాయింట్లకు మెరుగుపడిందని, ప్రపంచవ్యాప్తంగా సేవల రంగం పతనమైనా మన దేశంలో మాత్రం 58.9 పాయింట్ల వద్ద బలంగా నిలబడిందని గుర్తుచేశారు. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో విద్యుత్ వినియోగం 5.9 శాతం పెరిగిందని, పట్టణ ప్రాంతాల్లో వాహన అమ్మకాలు 11.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13.8 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. సామాన్యుడికి భారం కాకుండా రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం కంటే తక్కువగా 3.48 శాతం వద్దే అదుపులో ఉందన్నారు. దేశ ఆహార భద్రతను రక్షిస్తూ 817.53 లక్షల టన్నుల బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నాయని, 2026 ఆర్థిక సంవత్సరానికి గానూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చారిత్రాత్మక గరిష్ఠ స్థాయిలో 94.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
**ప్రభుత్వ చర్యలే అసలైన రక్షణ కవచాలు**
ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు తగ్గించి సామాన్యులకు కేంద్రం ఊరటనిచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ఈసీఎల్జీఎస్ 5.0 ద్వారా ఎంఎస్ఎంఈలకు వంద శాతం గ్యారెంటీ కవరేజీని ఇతర సంస్థలకు, విమానయాన రంగానికి 90 శాతం కవరేజీని అందించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇంధన ధరల అస్థిరతను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు ఒక్కో రుణగ్రహీతకు గరిష్టంగా రూ. 1,500 కోట్ల వరకు ఆర్థిక సహాయం పొందుపరిచామన్నారు. అదనంగా, బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు, లిగ్నైట్ కోల్ గ్యాసిఫికేషన్ కోసం కేంద్ర కేబినెట్ రూ. 46,000 కోట్లు ఆమోదించిందని, దీని ద్వారా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించే అవకాశం ఉందని తెలిపారు. ఈ చర్యలన్నీ ఉద్యోగాలను పరిరక్షించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు తీసుకున్నవే తప్ప, ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేవి కావని ఆయన స్పష్టం చేశారు.
**కాంగ్రెస్ హయాంలోనే వ్యవస్థల విచ్ఛిన్నం**
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే అసలైన ఆర్థిక విచ్ఛిన్నం జరిగిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. 2011-2013 మధ్య కాలంలో రూపాయి విలువ ఏకంగా 36 శాతం పతనమైందని విదేశీ మారక నిల్వలు 2011 జూలైలో 294 బిలియన్ డాలర్ల నుంచి 2013 ఆగస్టు నాటికి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆయన వివరించారు. డాలర్లను ఆకర్షించడానికి ఎఫ్సీఎన్ఆర్(బీ) విండోను తెరిచి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన దయనీయ స్థితి అప్పట్లో నెలకొందని, ఆనాడు ద్రవ్యోల్బణం సగటున 8.2 శాతంగా నమోదు కావడమే కాకుండా, మూలధన వ్యయం వాటా 31 శాతం నుంచి 16 శాతానికి పడిపోయిందని గుర్తుచేశారు. ఎలాంటి బాహ్య సంక్షోభాలు లేకపోయినా దేశాన్ని బలహీనపరిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు.
**ఓటర్ల జాబితా ప్రక్షాళనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?**
ప్రభుత్వ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌లు, న్యాయమూర్తులు తనకు రహస్యంగా సమాచారం ఇస్తున్నారని రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని మంత్రి కొట్టిపారేశారు. అంతటి సమాచార వ్యవస్థ ఆయనకు ఉంటే.. ఎన్నికల్లో ఆ పార్టీ ఎందుకు ఘోరంగా డిపాజిట్లు కోల్పోతోందని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఉద్దేశించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియను దేశ సర్వోన్నత న్యాయస్థానం, ప్రధాన ఎన్నికల కమిషనర్ సమర్థిస్తుంటే, రాహుల్ గాంధీ దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని కిషన్ రెడ్డి నిలదీశారు. అక్రమ ఓటర్లు, విదేశీ చొరబాటుదారులు ఓటర్ల జాబితాలో కొనసాగాలన్న దుర్మార్గపు ఆలోచనే ఇందుకు కారణమా అని ప్రశ్నించారు.
ప్రధాని కుర్చీ తన కుటుంబ హక్కు అనే భ్రమల్లో ఉన్న రాహుల్ గాంధీ, దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రతి కొన్ని నెలలకోసారి ‘ప్రజాస్వామ్యం అంతమైపోయింది, ఎమర్జెన్సీ రాబోతోంది’ అంటూ ఒక కొత్త కుట్ర సిద్ధాంతాన్ని సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వాస్తవాలను పక్కనపెట్టి కేవలం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్న రాహుల్, తన పార్టీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలకు తెరలేపుతున్నారని శ్రీ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.







