- ఆర్ఎస్ఎస్ను చాలామంది అపార్థం చేసుకున్నారు.
- అసలు వాస్తవాలు వివరించేందుకే ప్రజల్లోకి.
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.
తిరువనంతపురం, మహా.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళ పర్యటనకు వెళ్లిన ఆ సంస్థ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ అత్యంత ఆసక్తికరమైన, కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందిన ఆర్ఎస్ఎస్ను చాలామంది అపార్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సంస్థ గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించేందుకే తాము నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
“ఆర్ఎస్ఎస్ను తరచుగా అపార్థం చేసుకునే వారున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ అని ప్రజలు అంటుంటారు. కానీ, అదే సమయంలో అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడిన సంస్థ కూడా ఇదే. ప్రస్తుతం మా సంస్థ తన కార్యకలాపాల్లో 100వ వసంతంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, మరోసారి ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సంఘ్ గురించి వారికి సవివరంగా చెప్పాలని మేము నిర్ణయించుకున్నాం” అని ఆయన వివరించారు. సంస్థ ఎదుగుదలను ఆయన ఒక వృక్షంతో పోల్చుతూ.. ఒక విత్తనం నుంచి మొలకెత్తిన మొక్క, కాలక్రమంలో వృక్షంగా మారి పూలు, పండ్లు ఇస్తున్నప్పుడు అది కొత్త రూపాన్ని సంతరించుకున్నట్లు కనిపిస్తుందని, కానీ దాని మూలం ఆ విత్తనమేనని, ఆర్ఎస్ఎస్ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా క్రమంగా వికసిస్తోందే తప్ప తన మూలాలను వీడలేదని ఆయన స్పష్టం చేశారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్న మోహన్ భగవత్, సంస్థాగతంగా ఏర్పాటు చేసిన పలు ఉపన్యాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన తిరువనంతపురంతో పాటు త్రిస్సూర్ జిల్లాలో జరిగే సమావేశాలకు కూడా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ఆయన మాతా అమృతానందమయితోనూ సమావేశం కానున్నారు. జాతీయ భావజాల విస్తరణ, సమాజంలో సానుకూల శక్తుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా జాతీయ ప్రయోజనాలను కాపాడటమే ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు సైతం గుర్తుచేశారు. వంద సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆర్ఎస్ఎస్, భవిష్యత్తులోనూ దేశాభివృద్ధి కోసం, ధర్మ పరిరక్షణ కోసం అదే స్ఫూర్తితో నిరంతరం శ్రమిస్తుందని వారు ఉద్ఘాటించారు.








