విజయ్ సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.
• అధికార పార్టీ కార్యకర్తల నుంచే మహిళలకు ముప్పు.
• సిరా గుర్తు చెరగకముందే ప్రతిపక్ష ఎమ్మెల్యేల కోసం ‘షాపింగ్’.
• రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం.
• ఎమ్మెల్యేల కొనుగోళ్లపై నిప్పులు చెరిగిన ఎం.కే. స్టాలిన్.
చెన్నై , మహా.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న అప్రజాస్వామిక వ్యూహాలను తలపిస్తున్నాయని ఎం.కే. స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి విజయ్ ఏకంగా ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కోసం రాజకీయ బజారులో ‘షాపింగ్’ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
శనివారం చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వైఖరిని ఎండగట్టారు. రాష్ట్రంలో పాలిస్తున్న టీవీకే సర్కారు పూర్తిగా కేంద్రంలోని బీజేపీకి ‘జిరాక్స్ కాపీ’లా వ్యవహరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేయడం, మహిళలపై వేధింపులకు పాల్పడే సొంత పార్టీ నేతలను వెనకేసుకురావడం వంటి చర్యల ద్వారా విజయ్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతోందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి కేవలం ఇరవై ఒక్క రోజులు కూడా గడవకముందే, కనీసం ఓటర్ల వేలికి ఉన్న సిరా గుర్తు కూడా చెరిగిపోకముందే నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి చేరడం దారుణమన్నారు. వారికి ఏ స్థాయి పదవులు, ఎలాంటి భారీ ఆఫర్లు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారో ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి అనైతిక రాజకీయ ఫిరాయింపులు ప్రజాస్వామ్య మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రత గాలిలో దీపంగా మారిందని, ముఖ్యంగా అధికార పార్టీ కార్యకర్తల నుంచే మహిళలకు ముప్పు పొంచి ఉందని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీవైకుంఠంలో చోటుచేసుకున్న ఒక లైంగిక వేధింపుల ఘటనను ఆయన ఉదహరించారు. ఈ దారుణ ఘటనలో బాధిత మహిళ టీవీకే పార్టీకి చెందిన సభ్యురాలేనని, అలాగే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు కూడా అదే అధికార పార్టీకి చెందిన వారేనని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం అత్యంత పక్షపాతంతో వ్యవహరించిందని దుయ్యబట్టారు. తప్పు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఏకంగా బాధితురాలినే పార్టీ నుంచి అర్ధాంతరంగా తొలగించడం అధికార పార్టీ అహంకారానికి, మహిళల పట్ల వారికి ఉన్న చులకన భావానికి నిదర్శనమని స్టాలిన్ మండిపడ్డారు. రక్షక భటుల్లా ఉండాల్సిన అధికార పార్టీ కార్యకర్తల నుంచే మహిళలను రక్షించుకోవాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో దాపురించిందని విమర్శించారు.
గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు కావాలనే వక్రీకరించారని ఎం.కే. స్టాలిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి పరిపాలన కోసం కొంత సమయం ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని, కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, మహిళలపై దాడులు తనను మౌనంగా ఉండనివ్వడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అనైతికంగా కూల్చాలన్న ఉద్దేశం తమ పార్టీకి ఏ కోశానా లేదని, ఒక బాధ్యతాయుతమైన బలమైన ప్రతిపక్షంగా డీఎంకే ప్రజా సమస్యల పట్ల నిరంతరం గళం విప్పుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడం ప్రతిపక్షంగా తమ కనీస బాధ్యత అని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే పార్టీని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి మహిళా కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని, అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.








