Mahaa Daily Exclusive

  భారీ వర్షాల వేళ క్షేత్రస్థాయిలో డీజీపీ…

Share

భారీ వర్షాల వేళ క్షేత్రస్థాయిలో డీజీపీ.

* ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.

* అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక ఆదేశాలు.

హైదరాబాద్, మహా.

హైదరాబాద్‌ నగరంలో కురుస్తున్న ఏకధాటి వర్షాల నేపథ్యంలో రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) సీవీ ఆనంద్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలోని మల్కంపేట చెరువు, టోలిచౌకి తదితర పరిసర ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యలపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌తో డీజీపీ చర్చించారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి పోలీసు యంత్రాంగానికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

**ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు**

రహదారులపై వరద నీరు నిల్వ ఉండకుండా తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని డీజీపీ ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, రోడ్లపై నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టాలని, వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా ట్రాఫిక్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా మున్సిపల్, విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌) శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.

**జిల్లాల పోలీసులకు హైఅలర్ట్.. ప్రజలకు సూచనలు**

హైదరాబాద్‌ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం ఉన్నందున అన్ని జిల్లాల పోలీసు అధికారులను డీజీపీ అప్రమత్తం చేశారు. ఉన్నతాధికారులు, సిబ్బంది అంతా హైఅలర్ట్‌గా ఉండాలని, ఎక్కడ ఎలాంటి విపత్తు ముప్పు పొంచి ఉన్నా వెంటనే స్పందించేలా బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఇదే సమయంలో ప్రజలు సైతం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలకు, ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలకు ప్రజలు దూరంగా ఉండాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.