- అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఖరారు
- వచ్చే నెల 4 నుంచి టెహ్రాన్‌లో ప్రారంభం.
- యుద్ధ వాతావరణంతో ఇప్పటివరకు వాయిదా.
ఢిల్లీ, మహా.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల్లో ఆయన మరణించినప్పటికీ, ఆ తర్వాత ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల కారణంగా అంత్యక్రియల కార్యక్రమం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో ఇరాన్ అధికార యంత్రాంగం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తాజా ప్రకటన ప్రకారం.. జూలై 4వ తేదీన రాజధాని టెహ్రాన్‌లో ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం మూడు రోజుల పాటు టెహ్రాన్‌లోనే ఉంచనున్నారు. అనంతరం జూలై 7వ తేదీన ఇరాన్ ముస్లింలు పవిత్రంగా భావించే ‘కోమ్’ నగరానికి తరలించి, అక్కడ ప్రత్యేక ప్రార్థనలు, మతపరమైన సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
చివరిగా జూలై 9వ తేదీన ఖమేనీ స్వస్థలమైన మష్హద్ నగరానికి భౌతికకాయాన్ని తరలిస్తారు. అక్కడి ప్రసిద్ధ ‘ఇమామ్ రెజా ష్రైన్’ (ఇమామ్ రెజా దర్గా) ప్రాంగణంలోనే ఆయన అంతిమ ఖనన సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ దశాబ్దాల చరిత్రలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఖమేనీ అంతిమయాత్రకు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు, లక్షలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున టెహ్రాన్, కోమ్, మష్హద్ నగరాల్లో ఇరాన్ భద్రతా బలగాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.








