Mahaa Daily Exclusive

  ఒమన్ తీరంలో మునిగిపోయిన భారతీయ నౌక….

Share

ఒమన్ తీరంలో మునిగిపోయిన భారతీయ నౌక.

* 14 మంది నావికులు సురక్షితం.

* ఇంజన్ వైఫల్యంతో సముద్రంలో చిక్కుకున్న ‘ఎంఎస్‌వీ విరాట్ 1’.

*లైఫ్‌ బోట్ సాయంతో ప్రాణాలు దక్కించుకున్న సిబ్బంది.

* సహాయక చర్యలు చేపట్టి అందరినీ రక్షించిన అధికారులు.. ముంబైకి పయనం.

ఢిల్లీ, మహా.

ఒమన్ తీరంలో ఘోర ప్రమాదానికి గురైన భారతీయ వాణిజ్య నౌక ‘ఎంఎస్‌వీ విరాట్ 1’లోని నావికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇంజన్ వైఫల్యం కారణంగా నౌక సముద్రంలో మునిగిపోగా, అందులో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు ఒమన్‌ రాజధాని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. రాస్ అల్ హద్ తీరానికి సుమారు 80 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, అధికారుల సకాల స్పందనతో పెను విషాదం తప్పింది. ప్రస్తుతం సిబ్బంది అంతా పూర్తి ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) కూడా నిర్ధారించింది.

సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో ‘విరాట్ 1’ నౌకలో ఒక్కసారిగా యాంత్రిక లోపం తలెత్తి ఇంజన్ ఆగిపోయింది. పరిస్థితి విషమించి నౌక నెమ్మదిగా సముద్రంలో మునిగిపోతుండటంతో అప్రమత్తమైన 14 మంది సిబ్బంది వెంటనే లైఫ్‌ రాఫ్ట్ (ప్రాణ రక్షణ పడవ) సహాయంతో సముద్రంలోకి దిగి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఒమన్ అధికారులు, స్థానిక భారత రాయబార కార్యాలయ అధికారులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల ఉన్న నౌకలను అప్రమత్తం చేసి విస్తృత స్థాయిలో గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ముందుగా 11 మంది సిబ్బందిని రక్షించి, సమీపంలో ఉన్న ‘ఎంవీ జబల్ అలీ 9’ అనే నౌకలోకి చేర్చారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే గాలింపును ముమ్మరం చేసి మిగిలిన ముగ్గురిని కూడా సురక్షితంగా కాపాడారు. మొత్తంగా 14 మంది భారతీయ సిబ్బంది ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆపద సమయంలో ఒమన్ అధికారులు, ఇతర వాణిజ్య నౌకల సిబ్బంది అందించిన సహకారం మరువలేనిదని రాయబార కార్యాలయం ప్రశంసించింది. ప్రస్తుతం వీరందరూ ‘జబల్ అలీ 9’ నౌకలో ముంబైకి ప్రయాణిస్తున్నారని, త్వరలోనే వారు స్వదేశానికి చేరుకుంటారని అధికారులు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. భారతీయ నావికుల భద్రత, సంక్షేమం విషయంలో తాము నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని భారతీయ అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.