రెబల్స్‌కు గుర్తింపు ఇవ్వొద్దు!
* లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు టీఎంసీ అధికారిక వర్గం లేఖ.
* చీలిక వర్గాన్ని ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమన్న ఎంపీ సాగరికా ఘోష్.
* నేడు స్పీకర్‌ను కలవనున్న అసమ్మతి ఎంపీలు.. తమ బలం 22కు చేరుతుందన్న కాకోలి ఘోష్.
* అసెంబ్లీలోనూ అదే తీరు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర అగ్నిపరీక్ష.
ఢిల్లీ, మహా.
పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎంపీల వర్గానికి లోక్‌సభలో ఎలాంటి గుర్తింపు, ప్రత్యేక హోదా లేదా సదుపాయాలు కల్పించవద్దని టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. తమను ప్రత్యేక పార్లమెంటరీ బ్లాక్‌గా గుర్తించాలని కోరుతూ రెబల్ ఎంపీలు సోమవారం స్పీకర్‌ను కలవనున్న నేపథ్యంలో, అంతకంటే ముందుగానే ఆదివారం అభిషేక్ బెనర్జీ ఈ మేరకు లేఖ రాయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ)ని లోక్‌సభలో ఒకే రాజకీయ పార్టీగా పరిగణించాలని, పార్టీ అధికారికంగా నియమించిన నేత, విప్ మాటకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆ లేఖలో ఆయన స్పీకర్‌ను అభ్యర్థించారు. ఒకవేళ అసమ్మతి ఎంపీల నుంచి ఏవైనా విజ్ఞప్తులు వస్తే, వాటిపై నిర్ణయం తీసుకునే ముందు అధికారిక వర్గానికి తమ వాదన వినిపించే అవకాశం కల్పించాలని కోరారు.
**రాజ్యాంగ విరుద్ధమన్న ఎంపీ సాగరికా ఘోష్**
జూన్ 10వ తేదీన రాసిన ఈ లేఖను టీఎంసీ ఎంపీలు సాగరికా ఘోష్, కీర్తి ఆజాద్‌లు ఆదివారం స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ సాగరికా ఘోష్ మాట్లాడుతూ.. టీఎంసీ ఒక విడదీయరాని పార్టీ అని ఉద్ఘాటించారు. లోక్‌సభలో రెబల్స్ ఒక ప్రత్యేక వర్గాన్ని లేదా బ్లాక్‌ను ఏర్పాటు చేయడం అసాధ్యమని, ఆ ప్రతిపాదన పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు.
**చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు మాకుంది: అభిషేక్**
నిబంధనల ప్రకారం ఏదైనా పార్టీ విలీన ప్రతిపాదన చెల్లుబాటు కావాలంటే, కేవలం రాజకీయ పార్టీ విలీనం మాత్రమే కాకుండా ఎంపీల్లో మూడింట రెండొంతుల (2/3) వంతు సభ్యుల మద్దతు తప్పనిసరిగా ఉండాలని అభిషేక్ బెనర్జీ తన లేఖలో గుర్తుచేశారు. చట్టం ప్రకారం ఈ రెండింటిలో ఏ ఒక్క షరతు నెరవేరినా సరిపోదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే హక్కు అధికారిక టీఎంసీకి ఉందని ఆయన హెచ్చరించారు.
**మరో ఇద్దరు మావైపే వస్తున్నారు: కాకోలి ఘోష్**
మరోవైపు, తిరుగుబాటు ఎంపీల వర్గం మాత్రం తమకు పూర్తి మెజారిటీ ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ దిల్లీకి బయలుదేరే ముందు కోల్‌కతా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
“సోమవారం మేము లోక్‌సభ స్పీకర్‌ను అధికారికంగా కలుస్తున్నాం. పార్లమెంట్‌లో మమ్మల్ని ప్రత్యేక బ్లాక్‌గా గుర్తించాలని కోరతాం. త్వరలోనే మరో ఇద్దరు ఎంపీలు కూడా మా వర్గంలో చేరబోతున్నారు. దీంతో లోక్‌సభలో మా బలం 22కు పెరుగుతుంది.” అని ఆమె స్పష్టం చేశారు.
**మమతా బెనర్జీకి అగ్నిపరీక్ష**
ప్రస్తుతం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పార్లమెంట్‌లో ఎంపీలు చీలిక వర్గంగా ఏర్పడుతుండగా, మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సైతం అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. గత వారం పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 64 మంది విడిపోయారు. ఈ పరిణామంతో బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ వారిని వెంటనే ప్రత్యేక శాసనసభ పక్షంగా గుర్తించడంతో పాటు, రితబ్రత బెనర్జీకి ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. అయితే, స్పీకర్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయాన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక వర్గం కలకత్తా హైకోర్టులో సవాల్ చేసింది. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో, అధికారిక వర్గానికి చెందిన ఎంపీలు ఆదివారం మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.








