Mahaa Daily Exclusive

  ఖరీఫ్‌కు ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక సిద్ధం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

Share

ఖరీఫ్‌కు ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక సిద్ధం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

* తక్కువ నీటితో సాగయ్యే పంటలపై వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యాచరణ.

*87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో.. జిల్లాల్లో ముందస్తు నిల్వలు.

* ఎరువుల బుకింగ్‌ యాప్‌లో మార్పులు.. మీసేవ ద్వారా కూడా అవకాశం.

* వాట్సాప్‌ ద్వారా 28 లక్షల మంది రైతులకు వాతావరణ సలహాలు.

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలోని రైతాంగం కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. ఆదివారం ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విత్తనాల కొరత ఎక్కడా తలెత్తకుండా ఈ ఖరీఫ్ సీజన్‌కు గాను రికార్డు స్థాయిలో 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ఇప్పటికే అన్ని జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కలవరపెడుతున్న ఎల్‌నినో ప్రభావాన్ని తాము ముందుగానే అంచనా వేసి ఏప్రిల్ నెలలోనే వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ నిపుణులతో సమగ్రంగా సమీక్షించామని, అందుకనుగుణంగానే ఈ ముందస్తు సాగు ప్రణాళికను రూపొందించామని తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా, ఒకవేళ తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యామ్నాయ వ్యూహం ఎంతగానో తోడ్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

గత రబీ సీజన్‌లో రైతుల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో ప్రభుత్వం పలు కీలక మార్పులు, మెరుగుదలలు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. జిల్లా వారీగా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ నిర్వహణ, మండల మ్యాపింగ్ సదుపాయాలతో పాటు ఈసారి సరికొత్తగా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఎరువులను బుక్ చేసుకునే సులభతర సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఈ సరికొత్త యాప్ వినియోగం వల్ల ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద రైతులకు గంటల తరబడి వేచి ఉండే రద్దీ తగ్గడంతో పాటు పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉన్నందున, వర్షపాతంలో అనిశ్చిత పరిస్థితులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి విభిన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని తాము ముందస్తుగా పంటల ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల లభ్యతను పర్యవేక్షిస్తున్నామన్నారు. రైతులు కూడా స్థానిక వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ వ్యవసాయశాఖ అధికారులు అందించే సాంకేతిక సూచనలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి కోరారు.

రైతులకు ఖచ్చితమైన, సమయానుకూలమైన వాతావరణ సమాచారాన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమం” అమలు చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ అత్యాధునిక కార్యక్రమం ద్వారా మండలాల వారీగా కురిసే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలి వేగం తదితర అత్యంత కీలకమైన వాతావరణ వివరాలు నేరుగా రైతుల మొబైల్ ఫోన్లకు వాట్సాప్ సందేశాల రూపంలో చేరుతున్నాయని వెల్లడించారు. రైతులు క్షేత్రస్థాయిలో విత్తనాలు వేయడం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ చర్యలు వంటి అత్యంత కీలకమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వాతావరణ సలహా కార్యక్రమం దిక్సూచిలా ఉపయోగపడుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 28 లక్షల మందికి పైగా రైతులకు వాతావరణ సమాచార సందేశాలను విజయవంతంగా పంపించాం.” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు.

ప్రస్తుతం 71 శాతం విజయవంతమైన డెలివరీ రేటుతో ఈ వాతావరణ సమాచార కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైతుల సాగు వ్యయాన్ని తగ్గించి, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఇటువంటి సాంకేతిక ఆధారిత వినూత్న కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు మరింత విస్తరించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు.