జైపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.
*’కాక్రోచ్ జనతా పార్టీ’ చీఫ్ అభిజిత్ దీప్కేపై భౌతిక దాడి.
* నిరసన కార్యక్రమంలో అకస్మాత్తుగా చెంపదెబ్బ కొట్టిన ఆగంతకుడు.
* సోషల్ మీడియాలో భగ్గుమంటున్న సీజేపీ మద్దతుదారులు, నెటిజన్లు.
* వైరల్‌గా మారిన దాడి దృశ్యాలు.
జైపూర్,మహా.
సామాజిక మాధ్యమాల్లో ఉప్పెనలా దూసుకొచ్చి సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు, ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై అనూహ్య దాడి జరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో శాంతియుతంగా జరుగుతున్న ఒక ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనపై ఓ ఆగంతకుడు భౌతిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. అందరూ చూస్తుండగానే ఆయనపై చేయి చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై, ప్రజా సమస్యలపై వినూత్న రీతిలో గళమెత్తుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఆదరణ సంపాదించుకున్న అభిజిత్ దీప్కే.. జైపూర్‌లో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో తన మద్దతుదారులతో కలిసి పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబూని, ఆందోళనకారులతో కలిసి ఆయన నినాదాలు చేస్తున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. గుంపులో నుంచి అకస్మాత్తుగా దూసుకువచ్చిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, ఏమాత్రం ఊహించని విధంగా అభిజిత్ దీప్కే చెంపపై బలంగా కొట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తేరుకున్న సీజేపీ మద్దతుదారులు ఆ దాడికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
అకారణంగా జరిగిన ఈ భౌతిక దాడి పట్ల కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న ఒక యువ నాయకుడిపై ఇలా దాడులకు దిగడం పిరికిపంద చర్య అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వ్యవస్థలోని లోపాలను నిర్భయంగా ఎత్తిచూపుతూ, యువతను మేల్కొల్పుతున్నందునే గిట్టనివారు ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి కుట్ర పన్నారని సీజేపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడిని పలువురు సామాజిక కార్యకర్తలు సైతం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.








