మెట్రో నిధులపై కేంద్రం బ్రేక్!
* అన్ని ఒప్పందాలు పూర్తయినా ఐఆర్ఎఫ్‌సీ నిధులు ఎందుకు ఆపారు?
*రెండో దశకు కేంద్రం సహకరించకపోయినా.. వంద శాతం మా నిధులతోనే నిర్మిస్తాం.
* మెట్రో విస్తరణపై ఎంపీలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలి.
* సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి జీవనాడి లాంటి మెట్రో రైలు విస్తరణపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా స్వాధీనం (టేకోవర్) చేసుకునేందుకు అవసరమైన అన్ని అడ్డంకులు తొలగిపోయి, ఒప్పందాలు ఓ కొలిక్కి వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్ఎఫ్‌సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) నుంచి రావాల్సిన నిధులు అనూహ్యంగా ఎందుకు నిలిచిపోయాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి మీడియాతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా మెట్రో టేకోవర్, రెండో దశ విస్తరణ, నిధుల సమీకరణ తదితర అంశాలపై సవివరంగా ఆయన వివరించారు.
**అంతా పూర్తయినా.. నిధులెందుకు ఇవ్వరు?**
మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు ఆ సంస్థకు చెల్లించాల్సిన రూ. 13,500 కోట్ల నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎఫ్‌సీతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అన్ని రకాల ఒప్పందాలను పూర్తి చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ భారీ రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సాక్షాత్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ ద్వారా నిధులు ఇప్పటికే ఐఆర్ఎఫ్‌సీ ఖాతాలో జమయ్యాయని, ఒప్పందం ప్రకారం ఈ రోజే ఎల్ అండ్ టీకి ఆ నిధులు విడుదల కావాల్సి ఉండగా అనూహ్యంగా ఆగిపోవడం వెనుక ఉన్న కారణమేమిటని ఆయన నిలదీశారు. ప్రాజెక్టు స్వాధీనానికి గానూ ఫీజు రూపంలో రూ. 84 కోట్లతో పాటు, ఈక్విటీగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్లను కూడా ఇప్పటికే చెల్లించినట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకైనా 8 నుంచి 11 శాతం వడ్డీతో అప్పులు తెస్తే, తమ ప్రభుత్వం ప్రజల భారాన్ని తగ్గించేందుకు అత్యంత పారదర్శకంగా కేవలం 4 శాతం వడ్డీకే ఐఆర్ఎఫ్‌సీ నుంచి ఈ రుణాన్ని సమకూర్చిందని వివరించారు.
**రూ. 30 వేల కోట్ల ప్రాజెక్టు.. సగం ధరకే టేకోవర్**
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా జనాభా ఏకంగా 1.34 కోట్లకు చేరిన దరిమిలా, పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా మెట్రో విస్తరణ అత్యంత ఆవశ్యకమని సీఎం కుండబద్దలు కొట్టారు. మెట్రో రెండో దశ విస్తరణ కోసం ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి, రైల్వే శాఖల మంత్రులను స్వయంగా కలిసి పలుమార్లు ఒత్తిడి తెచ్చామన్నారు. అయితే, ఏటా రూ. 350 నుంచి రూ. 400 కోట్ల నష్టాలు వస్తున్న నేపథ్యంలో రెండో దశను తాము సొంతంగా చేపట్టలేమని ఎల్ అండ్ టీ తేల్చి చెప్పిందన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం సూచన మేరకే మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేసి, విస్తరణను చేపట్టేందుకు ఉక్కుసంకల్పంతో ముందుకెళ్తోందని వివరించారు. ఇందులో భాగంగానే సుమారు రూ. 30 వేల కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టును రూ. 15 వేల కోట్లకు టేకోవర్ చేసి నగర నలుమూలలా విస్తరించేలా అడుగులు వేస్తున్నామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు 50 శాతం నిధులు సమకూరుస్తున్న కేంద్రం, తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం అభ్యంతరం లేదని (ఎన్ఓసీ) సర్టిఫికెట్ ఇస్తే, వారి వాటాతో పనిలేకుండా వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మెట్రో ఫేజ్-2 ను నిర్మించేందుకు తమ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన సవాల్ విసిరారు.
**పదేళ్ల నిర్లక్ష్యం వల్లే 9వ స్థానానికి పతనం**
హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలన్న లక్ష్యంతో, ఆనాటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మెట్రోకు తొలి అంకురార్పణ జరిగిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన రవాణా వ్యవస్థను నిర్మించాలన్న తపనతో 2009లో టెండర్లు పిలిస్తే, 2020 నాటికి ప్రాజెక్టు పూర్తయిందని, కానీ చారిత్రక కట్టడాల సాకుతో గౌలిగూడ-ఫలక్‌నుమా మార్గాన్ని మాత్రం అసంపూర్తిగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభంలో రూ. 15 వేల కోట్లతో అనుకున్న ప్రాజెక్టు పూర్తయ్యే సరికి ఆ వ్యయం రూ. 22 వేల కోట్లకు చేరిందని చెప్పారు. గత పదేళ్ల పాలనలో మెట్రో విస్తరణపై కనీస ఆలోచన చేయకపోవడం వల్లే, ఒకనాడు దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో, నేడు 9వ స్థానానికి పడిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
**కిషన్ రెడ్డి చొరవ చూపాలి**
ఈ సున్నితమైన సమస్యను కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న రాష్ట్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెంటనే పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిజంగా మెట్రో విస్తరణకు 50 శాతం నిధులు ఇస్తుంటే, దానికి సంబంధించిన పత్రాలను బయటపెట్టాలని ఆయన కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాము ఈ సమస్యను జటిలం చేయదలచుకోలేదని, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని హైదరాబాద్ ప్రజలకు అత్యుత్తమ రవాణా సౌకర్యం అందించాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ టేకోవర్, నిధుల లావాదేవీల ఒప్పందాలన్నింటిపై రాష్ట్ర ఎంపీలకు సచివాలయంలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వివరిస్తానని ఆయన ప్రకటించారు. ఏది ఏమైనా నగర ప్రజల మౌలిక వసతుల కల్పనలో, మంచి చేయడంలో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.








