రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి విస్తారంగా వర్షాలు!
* ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం.
* మరో రెండు రోజులు ఉత్తరాదిన వడగాల్పుల తీవ్రత.
* దక్షిణ, మధ్య భాగాల్లో రుతుపవనాల విస్తరణ.
హైదరాబాద్:మహా.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. పశ్చిమ బంగాళాఖాతంలో ద్రోణి, దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు కొంత మందకొడిగా ముందుకు సాగుతుండటం వల్ల, అవి రాష్ట్రమంతటా సంపూర్ణంగా విస్తరించడానికి మరో నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాంతాలవారీగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణ వైపు వస్తున్న పొడి వేడిగాలుల ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తున్నాయి. ఇవాళ, రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో హీట్ వేవ్ తీవ్రంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, కక్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 10 శాతం మేర వర్షపాతంలో లోటు కొనసాగుతోంది. అయితే ఈ నెల 18 నుంచి కురిసే ముమ్మర వర్షాలతో ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉంది.








