- ఓట్ల చోరీ, సీట్ల చోరీ కాంగ్రెస్ నైజం
- ‘ఓటుకు నోటుతో ఓటు చోరీ చేసింది రేవంత్ రెడ్డే
- బంగ్లాదేశీ, రోహింగ్యాల దొంగ ఓట్లు ఎగిరిపోతాయనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంల ఏడుపు
- నాడు రాజకీయ స్వార్థంతో ఈసీఐకి చెందిన వారికి పదవుల ఎర వేసింది కాంగ్రెస్
- ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అబద్ధాల ప్రచారం ఆపండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, మహా : ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వార్థంతో బురదజల్లుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ అనేది ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర ప్రభుత్వమో సొంతంగా తెచ్చిన కార్యక్రమం కాదని, ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు 12 సార్లు ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని గుర్తుచేశారు. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామాలు మారిన వారి వివరాల సవరణ కోసమే ఎస్‌ఐఆర్ నిర్వహిస్తారన్నారు. 1951 నుండి 2002 వరకు కాంగ్రెస్ హయాంలోనే అనేకసార్లు ఎస్‌ఐఆర్ జరిగితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నాడు తాము ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించామని, కానీ నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే స్వరంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఎస్‌ఐఆర్ వల్లే బెంగాల్‌లో బీజేపీ గెలిచిందని మేధావులమని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. మరి అదే ఎస్‌ఐఆర్ జరిగిన కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచినప్పుడు ఎస్‌ఐఆర్ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. రాజకీయాల్లో గెలుపోటములు ప్రజా తీర్పుపై ఆధారపడి ఉంటాయన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధమైనదని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నిబంధనల ప్రకారమే జరుగుతోందని సుప్రీంకోర్టు సైతం రిట్ పిటిషన్ నెం. 640/2025 లో 124 పేజీల స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. నిబంధన 21ఏ ప్రకారం అర్హత లేని ఓట్లను తొలగించే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని కోర్టు స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
దేశ సరిహద్దులైన బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ అక్రమ చొరబాటుదారులు స్థానికంగా కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దొంగ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి ఓటర్లుగా నమోదవుతున్నారని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 5 వేల నుండి 10 వేల మంది పాకిస్తానీయులు చట్టవిరుద్ధంగా ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలా అని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలను నిలదీశారు. భారత రాజ్యాంగం ప్రకారం కేవలం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లను ఏరివేయడమే ఎస్‌ఐఆర్ లక్ష్యమని, అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటూ పోదని హామీ ఇచ్చారు.
“ఓటు చోరీ” అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే వారి ‘మెదడు చోరీ’ అయిందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 1980 లోనే సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఇందిరా గాంధీ గారి సఫదర్‌జంగ్ రోడ్ నివాసంలో (పోలింగ్ స్టేషన్ 145, సీరియల్ నెం. 388) ఓటరుగా నమోదయ్యారని రికార్డులను ఉటంకించారు. కాంగ్రెస్ చరిత్రే ఓట్ల చోరీ, సీట్ల చోరీలతో కూడుకున్నదన్నారు. నాడు కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు, నెహ్రూకు కేవలం 2 ఓట్లు వస్తే నెహ్రూను పీఎంను చేయడం ఓటు చోరీ కాదా అని ప్రశ్నించారు. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని చోరీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని నిలదీశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ కు చెందినవారికి రిటైర్మెంట్ తర్వాత పద్మ అవార్డులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు. బోగస్ ఓట్లతో గెలిచే అలవాటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు.. ఇప్పుడు ఎస్‌ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు ఎగిరిపోతాయనే భయంతో ఏడుస్తున్నాయన్నారు.
ఈ ప్రక్రియలో ప్రతి బూత్ వద్ద అన్ని పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు,రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొంటున్నారని, అంతా పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, తన సిబ్బందిపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా అని ప్రశ్నించారు. తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఏడాది జైలు శిక్ష పడుతుందనే నిబంధన ఎప్పటి నుంచో ఉందన్నారు. గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటు చోరీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ గెలవబోతోందని, ఓటమి భయంతోనే ఈ ముఠా అంతా కలిసి బీజేపీపై అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలందరూ ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, బీఎల్ఓల వద్ద ఫారాలు తీసుకుని తమ ఓట్లను క్లీన్ చేసుకోవాలని, డూప్లికేట్ ఓట్లు ఉంటే తొలగించుకోవాలని పిలుపునిచ్చారు.








