ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ ఈగో వార్.
* సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
* చేజేతులా మీ కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు.
* ఇద్దరు మహిళా అధికారులపై ధర్మాసనం ఆగ్రహం.
* మధ్యవర్తిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నియమకం.
* క్రిమినల్, సివిల్ విచారణలపై తక్షణ స్టే.
* ఐదేళ్ల వీధిపోరాటానికి ముగింపు పడేనా?
ఢిల్లీ, మహా.
గత మూడేళ్లుగా దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోన్న ఐపీఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిల మధ్య సాగుతున్న ‘ఈగో వార్’ (అహాల పోరు) ఎట్టకేలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. పరస్పర వ్యక్తిగత ఆరోపణలు, సోషల్ మీడియా వేదికగా సాగిన పోరాటాలు, కోట్ల రూపాయల నష్టపరిహార దావాలతో బ్యూరోక్రసీ ప్రతిష్టను దారుణంగా దిగజార్చుకుంటున్న ఈ ఇద్దరు ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టు గట్టి క్లాస్ పీకింది. ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలికేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
**కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు!**
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్దేవాలతో కూడిన సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది. “ప్రజాసేవలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన మీరిద్దరూ.. మీ చేతులతో మీరే మీ ఉజ్వల కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు” అని కోర్టు మౌఖికంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ అహంకార పూరిత వివాదాన్ని కేవలం చట్టం, కోర్టుల పరిధిలో తేల్చడం కంటే మధ్యవర్తిత్వం ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమని బెంచ్ అభిప్రాయపడింది. తదుపరి విచారణల కోసం ఇద్దరు అధికారులనూ జస్టిస్ కురియన్ జోసెఫ్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాకుండా, కింది కోర్టుల్లో వీరిద్దరిపై ఉన్న అన్ని రకాల క్రిమినల్, సివిల్ విచారణలపై సుప్రీంకోర్టు తక్షణ స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
**అసలు ఎక్కడ మొదలైంది ఈ రచ్చ?**
ఈ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వివాదం 2023 ఫిబ్రవరిలో బహిరంగంగా రచ్చకెక్కింది. నాటి ఐపీఎస్ అధికారిణి డి. రూపా.. ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరిని లక్ష్యంగా చేసుకుని తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. బెంగళూరు జలహళ్లిలో రోహిణి నిర్మించుకున్న భారీ బంగ్లా వివరాలను ఆమె తన ఆస్తిపాస్తుల వార్షిక నివేదికలో ఉద్దేశపూర్వకంగా వెల్లడించలేదని రూపా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా రోహిణికి సంబంధించిన కొన్ని అత్యంత వ్యక్తిగత చిత్రాలను (ఫోటోలను) సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తూ, ఆమె ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇది దేశవ్యాప్తంగా బ్యూరోక్రసీ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
**రూ. 1 కోటి దావా.. కోర్టు పోరాటం**
రూపా చేసిన ఆరోపణలను రోహిణి సింధూరి తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేందుకు ఐపీఎస్ అధికారిణి ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత కక్షతో ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆరోపిస్తూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రూపాపై ఐపీసీ సెక్షన్ 500 కింద క్రిమినల్ డెఫమేషన్ (క్రిమినల్ అవమాన) కేసు నమోదు చేయడంతో పాటు, తనకు జరిగిన మానసిక క్షోభకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని సివిల్ దావా వేశారు. ఈ కేసు సుదీర్ఘంగా సాగి, చివరకు కర్ణాటక హైకోర్టు రోహిణికి అనుకూలంగా తీర్పునిస్తూ రూపపై క్రిమినల్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు గడప తొక్కింది.
**కోర్టు చెప్పినా మారని ఇద్దరి తీరు!**
గతంలోనే సుప్రీంకోర్టు వీరిద్దరికీ పద్ధతి మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించింది. కోర్టు ఆదేశాల మేరకు డి. రూపా తన ఫేస్‌బుక్ ఖాతా నుంచి రోహిణికి వ్యతిరేకంగా పెట్టిన అన్ని వివాదాస్పద పోస్టులను తొలగిస్తూ న్యాయస్థానానికి అఫిడవిట్ కూడా సమర్పించారు. కానీ, ఇద్దరిలోనూ పంతాలు, పట్టుదలలు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2024లో రూపా మరో కొత్త క్రిమినల్ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు. రోహిణి సింధూరి తనను ‘మానసిక వికలాంగురాలిగా’ అభివర్ణిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆమె కొత్త ఫిర్యాదు చేయగా.. మేజిస్ట్రేట్ కోర్టు దీనిని స్వీకరించింది. దీనితో రోహిణి మళ్లీ హైకోర్టును, అక్కడి నుంచి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
**చట్టం కంటే సయోధ్యే శరణ్యం!**
ప్రజాసేవలో అత్యున్నత క్యాడర్లలో ఉండి, సమాజానికి దారి చూపాల్సిన ఇద్దరు మహిళా అధికారులు ఇలా వీధిపోరాటాలకు దిగడం సివిల్ సర్వీసెస్ క్యాడర్లకే పెద్ద మచ్చ తెచ్చింది. లాయర్ల సుదీర్ఘ వాదనలు, అధికారుల వ్యక్తిగత ఈగోల వల్ల ఈ సమస్య దాదాపు ఐదేళ్లుగా సాగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతోనైనా, జస్టిస్ కురియన్ జోసెఫ్ సమక్షంలో వీరిద్దరూ తమ వ్యక్తిగత పంతాలను, పట్టింపులను పక్కనబెట్టి ఒక కొలిక్కి వస్తారా లేదా అనేది బ్యూరోక్రసీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.







