Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే…

Share

  • సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే
  • కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై కావాలని నిందలు
  • సీఎం లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధ్వజం
  • కేంద్ర మంత్రులు, ప్రధానిని రేవంత్ కలిసినప్పుడల్లా కిషన్ రెడ్డికి చెప్పారా
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపైనా, కిషన్ రెడ్డిపైనా ఆరోపణలు

హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరుతూ నిన్న కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 71 సార్లు వెళ్లారని, కనీసం 15 సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తు చేశారు. అర్బన్ డెవలప్‌మెంట్, మెట్రో అంశాలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను 5 సార్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ని 3 సార్లు కలవడమే కాకుండా, హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమైన రేవంత్ రెడ్డి ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా? అని ప్రశ్నించారు.

ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం అపాయింట్‌మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయ నాటకం, బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి లేఖ రాశారని దుయ్యబట్టారు. తన వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ఆసక్తి లేదని, ఆ పార్టీకి కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. 2జి స్కామ్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్ లు కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ లను ఇప్పటి వరకు సమర్పించలేదని విమర్శించారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం ముమ్మాటికీ అవాస్తవమని తెలిపారు.

మెట్రో ఫేజ్-2కు కేంద్రం వ్యతిరేకం కాదని, ఎప్పుడూ ప్రాజెక్టును తిరస్కరించలేదని స్పష్టం చేశారు. ఇది కేంద్రం చేసిన ‘రిజెక్షన్’ కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన డిలే మాత్రమేనని తేల్చిచెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.