Mahaa Daily Exclusive

  ఆర్తనాదం విన్న ఆపద్బాంధవుడు…

Share

ఆర్తనాదం విన్న ఆపద్బాంధవుడు.
• భద్రకాళీ పాదాలపై పవన్ కన్నీటి ప్రార్థన.
• హోదాను పక్కనపెట్టి కదిలిన జనసేనాని!
• వరంగల్ వీధుల్లో కదిలొచ్చిన ఆత్మీయత!
• లక్ష సాయం, కుటుంబానికి భరోసా.
• అనారోగ్యంతో ఉన్న అభిమాని ఇంటిపై పవన్ వరాల జల్లు!

వరంగల్, మహా.

రాజకీయాలంటే కేవలం ఓట్లు, సీట్లు, ఎత్తుగడలు మాత్రమే కాదని.. పదవులు దక్కాక ప్రజలను మర్చిపోయే పాలకుల మధ్య, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక సామాన్య పసివాడి కోసం ఆ పదవినే పక్కనబెట్టి కదిలొచ్చిన ఒక అరుదైన నాయకుడి కథ ఇది. అంతుచిక్కని అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న ఒక చిన్నారి ఆర్తనాదం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనసును కలచివేసింది. తన ప్రాణం ఎప్పుడు గాల్లో కలిసిపోతుందో తెలియని ఆ పసివాడు, తన ఆరాధ్య దైవాన్ని ఒక్కసారైనా కళ్లారా చూడాలని చేసిన రోదనకు హనుమకొండ వీధులు సాక్షిగా అద్భుతమైన మానవత్వం పరిమళించింది. ఇది రాజకీయ నాయకుడి పర్యటన కాదు.. కష్టాల కడలిలో కూరుకుపోయిన ఒక నిరుపేద కుటుంబానికి కొండంత భరోసానిచ్చిన జనసేననీ అడుగుజాడ.

**గుండెను పిండేసిన చిన్నారి పిలుపు**

వరంగల్ జిల్లా హనుమకొండ ఫోర్ సీ కాలనీకి చెందిన నిరంజన్ అనే బాలుడు గత కొంతకాలంగా అత్యంత అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. నరకయాతన అనుభవిస్తూ కూడా ఆ పసివాడు తన వీధిలో తనను తాను “గబ్బర్ సింగ్” అని పిలుచుకునేవాడు. తన ప్రాణం ఉన్నప్పుడే తన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ ను ఒక్కసారైనా కలవాలన్న ఆ పసివాడి ఆఖరి కోరికను తెలుసుకున్న జనసేనాని తల్లడిల్లిపోయారు. క్షణం కూడా ఆలోచించకుండా, తన హోదాను, భద్రతా వలయాలను పక్కన పెట్టి నేరుగా ఆ పసివాడి ఇంటి గుమ్మం తొక్కారు. పవన్ కళ్యాణ్ ను తన కళ్ల ముందు చూసిన ఆ చిన్నారి కళ్ళలో మెరిసిన ఆనందం, ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది.

**కన్నీళ్లు తుడిచిన ఆపద్బాంధవుడు**

ఆ ఇంటి దీనస్థితిని, ఆ తల్లిదండ్రుల ఆవేదనను కళ్ళారా చూసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారు. మాటలకే పరిమితం కాకుండా, ఆ క్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కన్నీళ్లు తుడిచారు. ఆ కుటుంబం ఇకపై ఎవరి ముందు చేయి చాచకుండా, గౌరవంగా బతికేందుకు వీలుగా నిరంజన్ తల్లికి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసి ఇస్తానని మాటిచ్చారు. అంతేకాదు, అనారోగ్యంతో ఉన్న బాలుడి వైద్యానికి అండగా నిలవడమే కాకుండా, అతని సోదరి చదువుకయ్యే పూర్తి ఖర్చును తన భుజాలపై వేసుకున్నారు. ఊహించని ఈ వరాల జల్లుతో ఆ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ కాళ్లపై పడి కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం అక్కడున్న వారి కంట తడి పెట్టించింది.

**పసివాడి ప్రాణం కోసం భద్రకాళీ సన్నిధిలో పూజలు**

నిరంజన్ కు ధైర్యం చెప్పిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గుడికి వస్తే తన రాజకీయ భవిష్యత్తు కోసమో, తన కుటుంబం కోసమో పూజలు చేస్తారని అందరూ భావించారు. కానీ, పవన్ కళ్యాణ్ అక్కడ అర్చకులతో చేయించిన పూజ కేవలం తన ప్రాణ సమానమైన అభిమాని నిరంజన్ ఆయురారోగ్యాల కోసమే. మృత్యుంజయుడిగా ఆ బాలుడు తిరిగి రావాలని అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి కన్నీటితో ప్రార్థించారు. నిరంజన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను ఆలయంలో ఉంచి పూజలు చేసి, దాన్ని ఆ బాలుడికి శ్రీరామరక్షగా అందించారు. ఇది మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా చరిత్రలో మిగిలిపోయే ఘట్టం.

**రాజకీయాలకు అతీతంగా..మానవత్వానికి ప్రతీకగా**

ఈ మొత్తం పర్యటనలో ఎక్కడా ఏ చిన్న రాజకీయ ఛాయలు పడకుండా పవన్ కళ్యాణ్ అత్యంత జాగ్రత్త వహించారు. ఒక సామాన్యుడి ప్రాణం నిలబెట్టే ఈ యజ్ఞంలో తనకు సంపూర్ణ సహకారం అందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేతులెత్తి మొక్కి కృతజ్ఞతలు తెలిపారు. భద్రతను పర్యవేక్షించిన పోలీసు అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. “ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. నిన్ను త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో చూడాలి” అంటూ పవన్ ఇచ్చిన సందేశం కోట్లాది మంది హృదయాలను హత్తుకుంది. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ ఇలాంటి నిస్వార్థమైన ప్రేమాభిమానాలు మనిషిని చిరంజీవిగా నిలబెడతాయి అనడానికి వరంగల్ గడ్డపై జరిగిన ఈ అపూర్వ ఘట్టమే సజీవ సాక్ష్యం.