సైబర్ నేరస్థులు పరాన్నజీవులు.
* కఠిన చట్టాలు అవసరం.
* సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్.
ఢిల్లీ, మహా.
అమాయక ప్రజలను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కాజేస్తున్న సైబర్ నేరస్థులపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పెట్టుబడుల పేరుతో దోచుకుంటున్న ఇలాంటి మోసగాళ్లు సమాజాన్ని పట్టి పీడిస్తున్న పరాన్నజీవులని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించకూడదని, చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒక భారీ సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ, సదరు పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రోజురోజుకూ విస్తరిస్తున్న సైబర్ నేరాల ముప్పుపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ లాభాల ఆశచూపి అమాయకులను ఆకర్షించి నిలువునా ముంచుతున్న వారు సమాజానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. నిందితులను ఉద్దేశించి.. మీరు పరాన్నజీవులని, పెట్టుబడిదారుల నుంచి డబ్బులు గుంజి దారుణంగా మోసం చేస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారు సమాజంలో స్వేచ్ఛగా తిరగడం కంటే జైల్లో ఉండటమే దేశానికి శ్రేయస్కరమని తేల్చిచెప్పింది. సైబర్ నేరస్థుల విషయంలో న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించింది. ఇలాంటి మోసాలు దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్ ద్వారా సాగుతున్నాయని, గుజరాత్‌లో ఒకరిని, ముంబైలో మరొకరిని.. ఇలా పాన్ ఇండియా స్థాయిలో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని న్యాయస్థానం పేర్కొంది.
ఈ విచారణ సందర్భంగా కోర్టు ముందుంచిన గణాంకాలను ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. గతేడాది చివరి నాటికి దేశంలో డిజిటల్ మోసాల కారణంగా ప్రజలు ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయినట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ భారీ ఆర్థిక నష్టమే సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించింది. మరోవైపు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించిన గణాంకాలు సైతం ఈ ముప్పును స్పష్టం చేస్తున్నాయి. 2021 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో సైబర్ మోసాలు ఏకంగా 63 శాతం మేర పెరగడం గమనార్హం. దీంతో ఈ తరహా కేసుల సంఖ్య 86 వేల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల జాబితాలో కర్ణాటక తొలి స్థానంలో కొనసాగుతుండగా.. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.








