భారత్‌లో ఐఎస్‌ఐ ఉగ్ర కుట్ర భగ్నం.
* సైనికుల కదలికలపై నిఘా.
* ఏడుగురిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు.
ఢిల్లీ, మహా.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో దేశంలో దొంగచాటుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక అంతర్జాతీయ ఉగ్ర ముఠా గుట్టును దిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ కుట్రను భగ్నం చేసిన అధికారులు, కేసుతో సంబంధం ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా పన్నాగాలపై దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
గాజియాబాద్‌లో అరెస్టైన ఆరుగురిలో నలుగురు నిందితులు ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో పర్యటించినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వీరు పాకిస్థాన్‌కు చేరవేసినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. గతంలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరో భారీ దాడులకు పాక్ కుట్ర పన్నుతోందన్న కోణంలో విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే, దిల్లీ నుంచి జమ్మూ వరకు ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద సోలార్ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, భారత సైనికుల కదలికలపై నిఘా ఉంచేందుకు ఈ ముఠా ప్రయత్నించింది. ఇప్పటికే దిల్లీ కంటోన్మెంట్, హరియాణాలోని సోనిపట్ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఇలాంటి కెమెరాలను అమర్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ ఉగ్ర నెట్‌వర్క్ కార్యకలాపాలకు సంబంధించి మరో కీలకమైన అంశం కూడా బట్టబయలైంది. విదేశాల్లో ఉన్న తమ హ్యాండ్లర్లు వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలను భారతీయ నంబర్లతో వినియోగించుకునేలా ఈ ముఠా సహకారం అందించింది. దేశీయ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలను విదేశీయులకు పంపిస్తూ, ఒక్కో ఓటీపీకి రూ.500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇందుకోసం చోరీకి గురైన సిమ్ కార్డులతో పాటు, ముందుగానే యాక్టివేట్ చేసిన సిమ్‌లను వీరు వినియోగించారు. అంతేకాకుండా, పోలీసుల కళ్లుగప్పేందుకు ఈ ముఠా ఆర్థిక లావాదేవీల పద్ధతిని సైతం మార్చేసింది. తమ సొంత బ్యాంకు ఖాతాలను కాకుండా, జనసేవా కేంద్రాలు, స్థానిక బడ్డీ కొట్టుల ద్వారా నగదు రూపంలో డబ్బును స్వీకరించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దేశద్రోహ నెట్‌వర్క్‌తో ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో లోతైన విచారణ కొనసాగుతోందని, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే ఇలాంటి శక్తులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.








