Mahaa Daily Exclusive

  అమెరికా పటంలో దాగిన కుట్ర?

Share

అమెరికా పటంలో దాగిన కుట్ర?
* కశ్మీర్ సరిహద్దుల తప్పుడు చిత్రణపై భగ్గుమంటున్న భారత్.
ఢిల్లీ, మహా.
అగ్రరాజ్యం అమెరికా తీసుకున్న ఓ అనూహ్య నిర్ణయం, దానితో పాటే విడుదల చేసిన ఓ వివాదాస్పద పటం ఇప్పుడు దౌత్యపరంగా పెను దుమారానికి దారితీస్తోంది. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తాజాగా తమ ‘ఇండో-పసిఫిక్ కమాండ్ ‘ పేరును పాత పేరైన ‘పసిఫిక్ కమాండ్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత జరిగిన ఈ పేరు మార్పు ఒక ఎత్తయితే.. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన అధికారిక పటంలో భారత భౌగోళిక సరిహద్దులను అడ్డగోలుగా వక్రీకరించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్ తదితర ప్రాంతాలను ఇష్టానుసారంగా విభజించి చూపడం భారత సార్వభౌమాధికారంపై నేరుగా దాడి చేయడమేనన్న తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదాస్పద మ్యాప్‌లో భారత భూభాగాన్ని అమెరికా రక్షణ శాఖ అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా చిత్రించారు. ఆ పటంలో జమ్మూకశ్మీర్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను ప్రధాన భారత భూభాగం నుంచి పూర్తిగా వేరుచేసి చూపించారు. అంతటితో ఆగకుండా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని ఏకంగా పాకిస్థాన్‌లో అంతర్భాగంగా ప్రదర్శించడం భారతీయుల తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. మరోవైపు చైనా దురాక్రమణలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారతదేశ పటం నుంచి విడదీసి చూపారు. దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు తమ విడదీయరాని అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై భారత ప్రభుత్వం కుండబద్దలు కొడుతున్నప్పటికీ.. అమెరికా అధికారిక ప్రకటనలో ఇలాంటి పటాన్ని వినియోగించడం రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన దౌత్య సంబంధాలను కుదిపేసేలా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పటం వివాదం పక్కనపెడితే.. కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగించడం వెనుక ఉన్న రాజకీయ, వ్యూహాత్మక సంకేతాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2018లో డొనాల్డ్ ట్రంప్ తన తొలి విడత పాలనలో ఆసియాలో భారతదేశ ప్రాధాన్యతను, భౌగోళికంగా పెరుగుతున్న పరపతిని గుర్తిస్తూ అప్పటివరకు ఉన్న ‘పసిఫిక్ కమాండ్’ పేరును ‘ఇండో-పసిఫిక్ కమాండ్’గా మార్చారు. అయితే, ఇప్పుడు ట్రంప్ తన రెండో విడత పాలనలో అనూహ్యంగా అదే పేరును తిరిగి పాతపద్ధతిలోకి మార్చడం దౌత్య విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘ఇండో’ పదాన్ని తొలగించడం ద్వారా అగ్రరాజ్యం ఏదైనా పరోక్ష సందేశం ఇస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ తీవ్ర వివాదంపై అమెరికా రక్షణ శాఖ సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. కమాండ్ పేరు మారినంత మాత్రాన తమ బాధ్యతలు, వ్యూహాత్మక పరిధి, సైనిక కార్యకలాపాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. 1947 నుంచి 2018 వరకు సుదీర్ఘకాలం పాటు అమల్లో ఉన్న చారిత్రక పేరును కేవలం పునరుద్ధరించడం మాత్రమే తమ లక్ష్యమని పేర్కొంది. ఈ కమాండ్ భౌగోళిక పరిధి అమెరికా పశ్చిమ తీరం నుంచి భారతదేశ పశ్చిమ సరిహద్దుల వరకు మునుపటిలాగే యథాతథంగా కొనసాగుతుందని, తమ దళాల మోహరింపులో ఎలాంటి కుదింపు ఉండదని వెల్లడించింది.

వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు క్వాడ్ వేదికగా భారత్-అమెరికా దేశాల మధ్య ప్రస్తుతం అత్యంత బలమైన, వ్యూహాత్మక బంధం కొనసాగుతోంది. ఇలాంటి సానుకూల వాతావరణంలో అమెరికా తీసుకున్న ఈ తాజా చర్య దౌత్యపరమైన అగాధాన్ని సృష్టించే ప్రమాదం లేకపోలేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సున్నితమైన అంశంపై భారత విదేశాంగ శాఖ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా అమెరికా ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన పలు పటాల్లో పీవోకే, అక్సాయ్ చిన్‌లను భారత్‌కు వెలుపల చూపించిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయా సంస్థలు దిగివచ్చి తమ తప్పును సరిదిద్దుకుని పటాలను తొలగించాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పీవోకే, లద్దాఖ్‌లపై తమకున్న చట్టబద్ధమైన హక్కును, సార్వభౌమాధికారాన్ని భారత్ రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై మరింత ఉధృతంగా, బలంగా వినిపించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.