- ప్రైవేట్ సెక్యూరిటీ కి లైసెన్స్ తప్పనిసరి
- ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్
- సెక్యూరిటీ గార్డుల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి
- కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ నిబంధనలు అమలు చేయాలి
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే పీఎస్ఏఆర్ఏ లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. లక్డీకాపూల్లోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యాలయంలో వివిధ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఇంటెలిజెన్స్ సెక్యూర్టీ విభాగం ఓఎస్డీ వి. కమలాసన్ రెడ్డి, డీసీపీ రితురాజ్, అడ్మిన్ ఏజెన్సీ ఎస్పీ జి. చక్రవర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ఓనర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, అధ్యక్షులు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ రంగాన్ని నియంత్రించే కీలక అధికారిగా, అధికారుల సమక్షంలో అసోసియేషన్ల ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, అడిషనల్ డీజీ పలు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ‘ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులేషన్) యాక్ట్ 2005’ మరియు తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారం ప్రతి ఏజెన్సీకి లైసెన్స్ తప్పనిసరి.
గతంలో కొందరు ప్రాపర్ లైసెన్స్ లేకుండానే గార్డులను, సూపర్వైజర్లను నియమించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిందని, ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొందరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నేరాల్లో పాల్గొన్న సంఘటనలు వెలుగుచూడటంపై అడిషనల్ డీజీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీల యజమానులు తాము నియమించుకునే ప్రతి సిబ్బంది పూర్వాపరాలను, నేర చరిత్రను పోలీస్ వెరిఫికేషన్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి వారికి 21 రోజుల బేసిక్ ట్రైనింగ్ పొందిన తర్వాతే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. సెక్యూరిటీ గార్డుల శ్రమను దోపిడీ చేయకుండా, ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతన చట్టాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను యజమానులు ఖచ్చితంగా కల్పించాలని అధికారులు సూచించారు. ఈ నిబంధనల అమలును కార్మిక శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.
పోలీసులకు కళ్ళు, చెవులుగా వ్యవహరించాలి
క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు కళ్ళు, చెవులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. తమ పరిధిలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.







