Mahaa Daily Exclusive

  ఐనాక్స్ గ్రూప్‌లో రూ.10.4 కోట్ల భారీ సైబర్ మోసం…

Share

ఐనాక్స్ గ్రూప్‌లో రూ.10.4 కోట్ల భారీ సైబర్ మోసం.
* ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరిట టోకరా.
ఢిల్లీ, మహా.
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐనాక్స్ గ్రూప్‌ను సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా బురిడీ కొట్టించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పేరుతో వాట్సాప్ ద్వారా నమ్మించి ఓ సీనియర్ ఉద్యోగి నుంచి ఏకంగా రూ.10.4 కోట్ల భారీ మొత్తాన్ని కాజేశారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ మోసం జరగడం కార్పొరేట్ వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేసింది.
ఐనాక్స్ గ్రూప్ అకౌంట్స్ విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గిరీష్ అమిన్ ఈ స్కామ్‌లో బాధితుడిగా మారారు. జూన్ 3వ తేదీన ఆయనకు ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. తాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్‌ను మాట్లాడుతున్నానని, ఇది తన కొత్త వ్యక్తిగత నంబర్ అని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా (డీపీ) సిద్ధార్థ్ జైన్ ఫోటో ఉండటంతో గిరీష్ ఆ మెసేజ్ వచ్చింది వాస్తవంగా తన బాస్ నుంచే అని నమ్మాడు. తాను ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బును తాను పంపే ఖాతాలకు బదిలీ చేయాలని నిందితుడు ఆదేశించాడు.
బాస్ నుంచి నేరుగా ఆదేశాలు రావడంతో గిరీష్ అమిన్ ఏమాత్రం సందేహించలేదు. జూన్ 3 నుంచి జూన్ 15వ తేదీ మధ్య కేవలం రెండు వారాల వ్యవధిలో సుమారు 63 విడతల్లో వివిధ బ్యాంకు ఖాతాలకు ఏకంగా రూ.10.4 కోట్లను బదిలీ చేశాడు. ఆ తర్వాత అకౌంట్స్ సమీక్ష సమయంలో, తాను బదిలీ చేసిన నిధులకు సంబంధించి ఇన్‌వాయిస్‌లు ఇవ్వాలని గిరీష్ అధికారికంగా సిద్ధార్థ్ జైన్‌ను కోరడంతో ఈ భారీ మోసం బట్టబయలైంది. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఎవరికీ డబ్బు పంపమని అడగలేదని ఆయన స్పష్టం చేయడంతో బాధితుడు కంగుతిన్నాడు.
ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసుల సహకారంతో ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పెద్ద సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్ ఉండి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కేవలం వాట్సాప్ డీపీలు చూసి గుడ్డిగా నమ్మి, సరైన నిర్ధారణ చేసుకోకుండా నిధులు బదిలీ చేస్తే ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాలో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.