Mahaa Daily Exclusive

  ఓటర్ల జాబితాలో ‘మ్యాపింగ్’ కలకలం…

Share

ఓటర్ల జాబితాలో ‘మ్యాపింగ్’ కలకలం.
* కోట్లాది మంది భవితవ్యానికి పరీక్షగా ప్రత్యేక సమగ్ర సవరణ!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునాది అయిన ఓటు హక్కు రక్షణ ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ లక్షలాది మంది ఓటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రస్తుత 2025 ఓటర్ల జాబితాకు, సుమారు రెండు దశాబ్దాల క్రితం అంటే 2002లో నిర్వహించిన సర్ జాబితాకు మధ్య మ్యాపింగ్ ప్రక్రియను నిర్వహించగా, ఊహించని విధంగా భారీ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. ప్రస్తుత జాబితాలోని దాదాపు 30 శాతం వరకు పేర్లు పాత రికార్డులతో సరిపోలకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. దీనికి తోడు, మ్యాపింగ్ పూర్తయినట్లు భావిస్తున్న చాలా మంది ఓటర్ల వివరాలలో సైతం అనేక తప్పులు దొర్లాయని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నెల 25వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్న ‘సర్’ ప్రక్రియ కారణంగా ఈ లోపాలు ఉన్న ఓటర్లందరి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిర్ణీత సమయంలోగా సరైన ఆధారాలు చూపని పక్షంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు ఈ ప్రక్రియ దారితీయవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
**అంకెల్లో గందరగోళం.. కోటి మందికి పైగా అన్‌మ్యాపింగ్ జాబితాలోకి**
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 3,38,29,018 మంది ఓటర్లలో, కేవలం 2,36,54,232 మందిని మాత్రమే అధికారులు ప్రాథమికంగా గుర్తించగలిగారు. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే, ఈ విధంగా గుర్తించిన వారిలో కూడా ఏకంగా 89,44,713 మంది ఓటర్ల వివరాలలో పేర్లు, ఇంటి నంబర్లు, వయసు వంటి పలు రకాల వ్యత్యాసాలను అధికారులు కనుగొన్నారు. వీరంతా రాబోయే రోజుల్లో తమ నివాస, గుర్తింపు పత్రాలను సమర్పించి తప్పులను సరిదిద్దుకోకపోతే, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే, మొత్తం ఓటర్లలో మరో 1,01,74,786 మంది ఓటర్లను ఏకంగా ‘అన్‌మ్యాపింగ్’ జాబితాలో చేర్చడం గమనార్హం. మ్యాపింగ్‌తో పాటు అన్‌మ్యాపింగ్‌లోనూ అనేక లోపాలు దొర్లాయని, ఈ గందరగోళం వల్ల మొత్తం 1,91,19,499 మంది ఓటర్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతారని క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ మ్యాపింగ్ ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల అర్హులైన సామాన్య ఓటర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని వివిధ రాజకీయ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
**నియోజకవర్గాల్లో పెను ప్రభావం.. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో అత్యధిక లోపాలు**
ఈ మ్యాపింగ్ లోపాల ప్రభావం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా వలస కార్మికులు, నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఈ సమస్య జటిలంగా మారింది. ఉదాహరణకు నారాయణపేట జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలను పరిశీలిస్తే, అక్కడ ఉన్న మొత్తం 4,95,581 మంది ఓటర్లలో 4,23,118 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారు. అయితే, ఈ మ్యాపింగ్ అయిన వారిలో కూడా 1,87,149 మంది వివరాలలో వివిధ రకాల తప్పులను కనుగొన్నారు. దీనికి తోడు మరో 72,463 మంది ఓటర్లు అన్‌మ్యాపింగ్ జాబితాలోనే ఉండిపోయారు. జీవనోపాధి కోసం పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే కార్మికులే ఈ ప్రాంతంలో ఎక్కువ కావడం వల్ల, రాబోయే సర్ ప్రక్రియ వల్ల వీరే అత్యధికంగా నష్టపోతారనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది.
అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోనూ ఇదే పరిస్థితి దర్శనమిస్తోంది. నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న 2,64,309 మంది ఓటర్లలో 2,12,270 మంది జాబితాలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించినప్పటికీ, వారిలో 95,439 మంది వివరాలలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,50,455 మంది ఓటర్లకు గానూ 1,61,056 మందిని గుర్తించగా, వారిలో 71,000 మంది వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,39,900 మంది ఓటర్లు ఉండగా, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) కేవలం 12,53,284 మందిని మాత్రమే గుర్తించారు. వీరిలో కూడా 5,07,143 మంది వివరాలలో తప్పులు ఉన్నట్లు గుర్తించడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఓటర్ల వివరాలలో అత్యధిక వ్యత్యాసాలు ఉన్న జిల్లాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి నిలిచింది. ఈ జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 29,78,532 మంది ఓటర్లు ఉండగా, అధికారులు కేవలం 12,89,802 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఈ గుర్తించిన వారిలో కూడా ఏకంగా 8,38,150 మంది ఓటర్ల వివరాలు తప్పులతడకగా ఉన్నట్లు తేలింది. ఈ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సైతం గుర్తించిన ఓటర్ల వివరాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
**నోటీసుల భయం.. ఓటు భద్రపరుచుకోవడానికి చూపించాల్సిన గుర్తింపు పత్రాలు ఇవే**
రాబోయే రోజుల్లో ఈ వ్యత్యాసాలు ఉన్న ఓటర్లలో చాలా మందికి బూత్ స్థాయి అధికారులు ఎన్యూమరేషన్ పత్రాలను నింపాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ నోటీసులు అందిన వారు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి మరియు తమ వివరాలను సరిదిద్దుకోవడానికి ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) తమ ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డును గానీ, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వును (పీపీవో) గానీ చూపించవచ్చు. అలాగే, 1987 జూలై 1వ తేదీన లేదా అంతకు ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు లేదా ఎల్ఐసీ జారీ చేసిన పత్రాలను కూడా నిరూపణగా అంగీకరిస్తారు. వీటితో పాటు అధికారికంగా జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్) లేదా చెల్లుబాటులో ఉన్న భారత పాస్‌పోర్ట్ ను సమర్పించవచ్చు. విద్యా అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రిక్యులేషన్ లేదా ఇతర విద్యా ధృవీకరణ పత్రాలను కూడా ఆధారాలుగా అంగీకరిస్తారు. సంబంధిత అధికార సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, అటవీ హక్కుల ధృవీకరణ పత్రం, లేదా అధికారిక కుల ధృవీకరణ పత్రాన్ని కూడా ఓటర్లు ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన కుటుంబ నమోదు ధృవీకరణ పత్రం (ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి లేదా ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రాలను సమర్పించి ఓటర్లు తమ ఓటు హక్కును సురక్షితం చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ మహా క్రతువులో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఎంతైనా ఉంది.