Mahaa Daily Exclusive

  సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి….

Share

సింగరేణిలో తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి.
* మనుగడ కోసం కొత్త గనులపైనే ఆశలు!
* థర్మల్ ప్లాంట్లలో పడిపోతున్న నిల్వలు.
* విద్యుత్ రంగానికి బొగ్గు కొరత సెగ.

హైదరాబాద్, మహా.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఇంధన రంగానికి గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ సంస్థలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోతుండటం రానున్న రోజుల్లో తీవ్ర ఇంధన సంక్షేపానికి దారితీసేలా కనిపిస్తోంది. రోజురోజుకూ క్షీణిస్తున్న నల్లబంగారం ఉత్పత్తి భవిష్యత్తులో పెను సమస్యగా మారబోతోందని పారిశ్రామిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ భారీగా తగ్గించుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలుత 7.20 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని ఒక బృహత్తర లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ, ఆ తర్వాత దానిని 6 కోట్ల టన్నులకు పరిమితం చేయాల్సి వచ్చింది. అంతలా లక్ష్యాన్ని తగ్గించినప్పటికీ చివరకు సాధించింది మాత్రం కేవలం 5.80 కోట్ల టన్నులు మాత్రమే కావడం సంస్థ అంతర్గత ఉత్పత్తి సామర్థ్య లోపాలను ఎత్తిచూపుతోంది. ఇదే నిరాశాజనక ఒరవడిని కొనసాగిస్తూ ప్రస్తుత సంవత్సరంలో కూడా సంస్థ కేవలం 6 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.

**మూతపడనున్న గనులు.. కొత్త ప్రాజెక్టులే శరణ్యం**

రాబోయే కాలంలో సింగరేణి మనుగడ సాగించాలంటే కొత్త గనుల ప్రారంభం అత్యంత ఆవశ్యకంగా మారింది. ఎందుకంటే వచ్చే 2027-28 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి పరిధిలోని నాలుగు కీలకమైన గనులు పూర్తిగా మూతపడనున్నాయి. కాగా ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1.25 కోట్ల టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉంది. ఈ ఊహించని భారీ నష్టాన్ని భర్తీ చేస్తూ సంస్థ తన ఉనికిని కాపాడుకోవాలంటే తక్షణమే మరో తొమ్మిది కొత్త గనుల్లో ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బొగ్గు గనులను అందుబాటులోకి తెచ్చి ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మూడు కొత్త గనులను, వచ్చే ఏడాది మరో రెండు కొత్త గనులను ప్రారంభించేందుకు విస్తృత సన్నాహాలు జరుగుతున్నాయి.
నిజానికి ఇవి సంస్థకు కొత్తగా కేటాయించిన బ్లాకులు కావు. గతంలోనే ఆయా ప్రాంతాల్లో భూగర్భ గనుల ద్వారా తవ్వకాలు ప్రారంభించి, కొన్ని కారణాల వల్ల మధ్యలోనే వదిలేసిన ప్రాంతాలపైనే ఇప్పుడు సంస్థ కన్నేసింది. గతంలో భూగర్భంలో తవ్వి వదిలేసిన బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు వాటిని ఉపరితల (ఓపెన్ కాస్ట్) గనులుగా మార్చాలని, లేదా ప్రస్తుతం నడుస్తున్న ఓసీలకు కొనసాగింపు ప్రాజెక్టులుగా చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు.

**అనుమతుల వేగవంతం.. అపార నిల్వలే లక్ష్యం**

కొత్త ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వీటికి సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఇటీవల కోరింది. ప్రభుత్వ దిశా నిర్దేశంతో రంగంలోకి దిగిన సంస్థ ప్రత్యేక కార్యాచరణను రూపొందించగా, ఇప్పటికే మూడు గనులకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. ఇందులో భాగంగా ఒడిశాలోని ప్రతిష్టాత్మక నైనీ బ్లాక్ పరిధిలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి పనులను ప్రారంభించారు. అప్పటికే మూతపడ్డ భూగర్భ గనుల లోతుల్లో మిగిలిపోయిన అపారమైన బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు గట్టి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఉపరితల గనుల విస్తరణతో కలిపి మొత్తం ఎనిమిది ప్రధాన ప్రాజెక్టులు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ కొత్త ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే, కొత్తగూడెంలోని వీకే కోల్ మైన్ పరిధిలో గతంలో తవ్వకాలు ఆపేసిన గనిలో ఇంకా 19 కోట్ల టన్నుల అపార బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఇల్లెందు ఏరియాలోని జేకే ఓపెన్ కాస్ట్ గనిలో 1.96 కోట్ల టన్నులు, రామగుండం-3 ఏరియా పరిధిలోని రామగుండం ఓసీ-1 విస్తరణ ప్రాజెక్టులో అత్యధికంగా 18.10 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయి. వీటితో పాటు బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓపెన్ కాస్ట్ గనిలో 3.89 కోట్ల టన్నులు, ఎంవీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 3.03 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు లెక్కగట్టారు. మణుగూరు ఏరియాలోని మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్‌టెన్షన్‌లో 4.04 కోట్ల టన్నులు, మందమర్రి ఏరియా పరిధిలోని ఆర్‌.కె.పి. ఓసీపీ ఫేజ్-2 ప్రాజెక్టులో 3.44 కోట్ల టన్నులతో పాటు మణుగూరు ఏరియాలోని పీకే కోల్ మైన్, కొండాపూర్ పరిధిలో 6.2 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

**థర్మల్ ప్లాంట్లలో నిల్వల క్షీణత.. ముదురుతున్న విద్యుత్ సంక్షోభం**

సింగరేణిలో ఉత్పత్తి క్షీణత ప్రభావం ఇప్పటికే దేశీయ, రాష్ట్ర విద్యుత్ రంగంపై పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా థర్మల్ ప్లాంట్లకు తగినంత బొగ్గు సరఫరా కావడం లేదని కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తంచేసింది. కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి అనేక రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కనీస స్థాయి కంటే దారుణంగా పడిపోయాయని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం జూన్ 13 నాటికి తెలంగాణ విద్యుత్పత్తి సంస్థ (జెన్కో) పరిధిలోని ప్లాంట్లలో కనీసం 25.54 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు నిల్వ ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుత కొరత కారణంగా అందులో కేవలం 24 శాతం మాత్రమే, అనగా 6.09 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ బొగ్గు కొరత సంక్షోభం ఇలాగే ముదిరితే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం పొంచి ఉందని, కాబట్టి కొత్త గనుల నుంచి త్వరితగతిన ఉత్పత్తిని పెంచడమే దీనికి ఏకైక మార్గమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.