Mahaa Daily Exclusive

  రేవంత్‌రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్స్….

Share

రేవంత్‌రెడ్డివన్నీ డైవర్షన్ పాలిటిక్స్..
* మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం.
* తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్‌.రాంచందర్‌ రావు.
* అపాయింట్‌మెంట్‌ లేఖల పేరుతో సీఎం కొత్త డ్రామాలు.
* రెండున్నరేళ్లలో 71 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్.. కిషన్ రెడ్డిపై ఆరోపణలు బూటకం.
* బీజేపీలో చేరిన సీనియర్ నటి జ్యోతి రెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్.
హైదరాబాద్, మహా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలను నిజం చేయాలని చూస్తూ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండున్నరేళ్ల పాలనలో ఢిల్లీకి ఏకంగా 71 సార్లు వెళ్లారని, అందులో కనీసం 15 సార్లు కేంద్రమంత్రులను స్వయంగా కలిశారని గుర్తుచేశారు. అర్బన్ డెవలప్‌మెంట్, మెట్రో అంశాలపై కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను 5 సార్లు, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను 3 సార్లు కలవడమే కాకుండా, హైదరాబాద్‌లో కూడా పలుమార్లు సమావేశమైన రేవంత్ రెడ్డి, ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్ రెడ్డికి చెప్పి కలిశారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అపాయింట్‌మెంట్‌ ఇప్పించడం లేదంటూ కిషన్ రెడ్డిపై నిందలు వేయడం ముమ్మాటికీ బూటకమని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకే సీఎం ఈ లేఖల డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
**అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం**
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కటీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు చదువులకు దూరమవుతూ భవిష్యత్తు భారంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో టీచర్లు, కళాశాలల్లో ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేక ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందని, గురుకులాల పరిస్థితి దయనీయంగా మారి ప్రభుత్వ పాఠశాలలు మూతపడే స్థితికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవని, పెన్షన్లు సక్రమంగా అందక రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. రైతు భరోసా అమలు కాకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర సమస్యలు ఉండటంతో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉందని, ఈ వైఫల్యాలన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ‘గోబెల్స్’ తరహా అబద్ధాల ప్రచారానికి తెరలేపారని విమర్శించారు.
**పత్రాలు ఇవ్వకుండా కేంద్రంపై నిందలా?**
కాంగ్రెస్ పార్టీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై ఎలాంటి ఆసక్తి లేదని, ఆ పార్టీకి కేవలం స్కాములు, కమీషన్ల రాజకీయాలపైనే అనుభవం ఉందని రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. 2G స్కామ్, అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్‌లు కాంగ్రెస్ చరిత్ర అని విమర్శించిన ఆయన, ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదించాలో కూడా తెలియదన్నారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్టు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్టు, డీపీఆర్ లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్రానికి సమర్పించలేదని వెల్లడించారు. అవసరమైన సాంకేతిక పత్రాలు ఇవ్వకుండా కేంద్రం అడ్డుకుంటోందని చెప్పడం ముమ్మాటికీ అవాస్తవమని, కేంద్రం మెట్రో ఫేజ్-2కు ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇది కేంద్రం చేసిన ‘రిజెక్షన్’ కాదు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన ‘డిలే’ (ఆలస్యం) మాత్రమేనని తేల్చిచెప్పారు. రుణాల చెల్లింపుల కంటే ముందు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంశంపై, ప్రాజెక్టు నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని కేంద్రం సూచించిన సలహాలు పాటించకుండా, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను ప్రధాని మోదీనే ప్రారంభించారని, ఫేజ్-2కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది కూడా కేంద్రమేనని గుర్తుచేశారు.
**అభివృద్ధికి బీజేపీనే కేరాఫ్ అడ్రస్**
2014 వరకు దేశంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో మాత్రమే ఉండగా, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 1,155 కిలోమీటర్లకు పెరిగిందని రాంచందర్ రావు వివరించారు. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి వాజ్‌పేయి హయాం, మోదీ పాలన స్వర్ణయుగాలని, తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 13 లక్షల కోట్లకు పైగా సహకారం అందించిందని చెప్పారు. కేంద్రం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అదనంగా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని పలుమార్లు కలిసిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దేశంలో 70 ఎయిర్‌పోర్టులు ఉన్న స్థితి నుంచి 150కి పైగా ఎయిర్‌పోర్టులు నిర్మించిన ఘనత, ప్రతిరోజూ సగటున 68 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మిస్తున్న చరిత్ర, వందే భారత్ రైళ్లు, రైల్వే బ్రాడ్‌గేజ్ విస్తరణలో చారిత్రక పురోగతి సాధించిన రికార్డు బీజేపీ ప్రభుత్వానిదేనని చాటిచెప్పారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్, అహంకారాన్ని పక్కనపెట్టి తెలిసిన వారి సలహాలు తీసుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ చేసే ‘డైవర్షన్ పాలిటిక్స్’ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.
**బీజేపీలోకి చేరికల జోరు**
ఇదే తరుణంలో, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, సినీ నిర్మాత బండి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి రాంచందర్ రావు గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అద్భుత ప్రగతి, దేశాభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసమే వివిధ రంగాల ప్రముఖులు స్వచ్ఛందంగా బీజేపీ వైపు ఆకర్షితులై పార్టీలో చేరడానికి బలమైన కారణమని స్పష్టం చేశారు.