Mahaa Daily Exclusive

  సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం…

Share

  • సచివాలయం ముట్టడికి జర్నలిస్టుల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • గన్ పార్కు వద్ద అరెస్టులు

హైదరాబాద్, మహా : రాష్ట్ర ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, తమ డిమాండ్ల సాధనకై గురువారం జర్నలిస్టులు ”ఛలో హైదరాబాద్”కార్యక్రమం నిర్వహించారు. గన్ పార్క్ నుంచి సచివాలయం ముట్టడికి బయలుదేరిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన ”ఛలో హైదరాబాద్” పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టుల గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలు పెట్టి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పన్నెండేళ్ళుగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పాలకులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన జర్నలిస్టులను పాలకులు చిన్నచూపు చూడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి చేయి చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో అనేక చిన్న, మధ్య తరహా పత్రికలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని, రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్స్ బిల్స్ ఇవడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్స్ వెంటనే ఇవ్వాలని, ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలని, గ్రేటర్ హైదరాబాద్ తో సహా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్లస్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్నై, పీఆర్జీఐ రిజిస్ట్రేషన్ తో రెగ్యులారిటీ ఉన్న పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఉచిత విద్యను అందించాలని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రతి జర్నలిస్టుకు ఉచిత బీమా పథకం ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు పెన్షన్లు ఇవ్వాలని, జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించాలని, జర్నలిస్టుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది జర్నలిస్టులు పాల్గొని ప్లకార్డులతో నినదించారు.

అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పంజాగుట్ట, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్ కుమార్, యాదగిరి, తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ చిర్రా శ్రీనివాస్, దామెర జగదీశ్వర్ గుప్తా, కే. పాండురంగారావు, పద్మనాభరావు, సామ్రాట్ గుప్తా, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవి కుమార్, కో-కన్వీనర్లు ఆర్. శ్రీనివాస్ గౌడ్, సంతోష్ కుమార్, ఎం.రవికుమార్, సుభాష్, రేగటి వెంకన్న, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్, మహబూబ్ నగర్ జిల్లా కార్యాధ్యక్షుడు గండీటి నర్సింహా, కార్యదర్శి గోపాల్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మధు, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాల్వాయి జానయ్య, ముషం హరిప్రసాద్, వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జక్కుల విజయ్ కుమార్, స్వామిదాస్, పాలడుగు సురేందర్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దూమర్ల బాస్కర్, రంగారెడ్డి జిల్లా నాయకులు అశోక్ కుమార్ గౌడ్, పర్వతాలు, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం,గడ్డమీది అశోక్ తదితరులు పాల్గొన్నారు.