సాయి రాయలసీమ పేపర్ మిల్స్‌కు ఊరట.
* ఫెమా కేసును మూసివేస్తూ ఆర్బీఐ కాంపాండింగ్ ఉత్తర్వులు జారీ.
* రూ. 19,17,500 చెల్లింపుతో ముగిసిన విచారణ.
హైదరాబాద్, మహా.
ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), 1999 నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘సాయి రాయలసీమ పేపర్ మిల్స్ లిమిటెడ్’ సంస్థకు భారీ ఊరట లభించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిరభ్యంతరం (నో అబ్జెక్షన్) వ్యక్తం చేయడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కాంపాండింగ్ (రాజీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ సంస్థపై ఫెమా కింద జరుగుతున్న విచారణ, తదుపరి న్యాయపరమైన చర్యలు అధికారికంగా ముగిశాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు ఈడీ అధికారులు ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై గతంలో సాయి రాయలసీమ పేపర్ మిల్స్‌పై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం, పలు నిబంధనల ఉల్లంఘనలను ఎత్తిచూపుతూ అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు ఫెమా సెక్షన్ 16 కింద ఈడీ ఫిర్యాదు దాఖలు చేసింది. అనంతరం ఈ వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు సాయి రాయలసీమ పేపర్ మిల్స్ లిమిటెడ్ యాజమాన్యం ఫెమా సెక్షన్ 15 ప్రకారం ఆర్బీఐకి కాంపాండింగ్ కోసం దరఖాస్తు చేసుకుంది.
గురువారం విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం.. సంస్థ పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ పరిశీలించి, చట్ట నిబంధనలకు లోబడి కాంపాండింగ్ చేయడానికి ఈడీ అభిప్రాయాన్ని కోరింది. ఈడీ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం కావడంతో, ఆర్బీఐ 13ఏప్రిల్ 2026 తేదీన కాంపాండింగ్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, సదరు ఉల్లంఘనలకు గాను సంస్థ ఒకేసారి (వన్-టైమ్ పేమెంట్) రూ. 19,17,500లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ చెల్లింపుతో సాయి రాయలసీమ పేపర్ మిల్స్‌పై ఫెమా ఉల్లంఘనల కింద నమోదైన అడ్జుడికేషన్ విచారణలతో పాటు తదుపరి లిటిగేషన్ అంతా పూర్తిగా ముగిసినట్లు అధికారులు స్పష్టం చేశారు.








