టెలిగ్రామ్ ఒక సరికొత్త ‘డార్క్ వెబ్’గా మారింది!
* సైబర్ నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా రూపాంతరం.
* ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం సంచలన అఫిడవిట్.
* పరీక్ష పత్రాల లీకేజీల నుంచి డేటా విక్రయాల వరకు టెలిగ్రామ్ ఛానళ్లే ఆధారం.
ఢిల్లీ, మహా.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ప్రధాన వేదికగా మారిందని కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుత రోజుల్లో టెలిగ్రామ్ కేవలం ఒక సమాచార మార్పిడి యాప్‌లా కాకుండా, ఒక సరికొత్త ‘డార్క్ వెబ్’లా రూపాంతరం చెందిందని ఆందోళన వ్యక్తం చేసింది. నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం కంటికి చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను విరివిగా ఉపయోగిస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక కీలక అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
నీట్ వంటి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, వాటి అక్రమ పంపిణీకి టెలిగ్రామ్ ఛానళ్లు ప్రధాన వేదికగా మారాయని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ రకమైన అక్రమ పద్ధతులు దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రమైన ప్రమాదంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి తోడు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు భారీగా పెరిగాయని వివరించింది. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డేటాను విక్రయించడానికి, మనీ లాండరింగ్ కోసం ఉపయోగించే ‘మ్యూల్ బ్యాంక్ ఖాతాల’ను ఇక్కడ బహిరంగంగానే కొనుగోలు చేస్తున్నారని అఫిడవిట్‌లో పేర్కొంది.
దేశ శాంతిభద్రతలకు, పౌర సమాజ భద్రతకు టెలిగ్రామ్ పెద్ద సవాలుగా మారిందని కేంద్రం పేర్కొంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఈ యాప్ ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, వివిధ ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు తమ నిర్వాకాలను, భావజాలాన్ని ప్రచారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి వదలడం ద్వారా అశాంతిని రేకెత్తించడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని తెలిపింది.
కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల ఫోన్లలోని డేటాను దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను ఒక కమాండ్ అండ్ కంట్రోల్ ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నాయని కేంద్రం వివరించింది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను సైతం బైపాస్ చేసే టూల్స్, నకిలీ ఫైనాన్స్ యాప్‌ల రూపంలో ఉండే మాల్వేర్‌లను ఇక్కడ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని చెప్పింది. గతంలో వివిధ సంస్థల నుంచి లీకైన డేటాబేస్‌ల ఆధారంగా పౌరుల మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బోట్లు పనిచేస్తూ పౌరుల ప్రైవసీని దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వం ఆరోపించింది. కేవలం సైబర్ నేరాలే కాకుండా, కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను అనధికారికంగా పంపిణీ చేయడం ద్వారా పైరసీకి ఇది పెద్ద అడ్డాగా మారిందని, దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని తెలిపింది.
టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ, అనామక ఫీచర్లు నేరగాళ్లకు అండగా నిలుస్తున్నాయని కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలను ఇతరులకు కనిపించకుండా దాచుకునే సదుపాయం ఉండటం వల్ల, నేరాలకు పాల్పడుతున్న అసలు సూత్రధారులను, వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది.








