భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.
• స్తంభించిన జనజీవనం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.
• ఐటీ కారిడార్‌లో భారీ ట్రాఫిక్ జామ్.
• అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారుల హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఏకధాటిగా కురిసిన వానతో పలుచోట్ల ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు పలు కాలనీల్లోకి చేరడంతో లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురై స్థానికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు.
నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, యూసఫ్‌గూడ, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కుండపోత వాన కారణంగా ఆయా మార్గాల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ అధికారులు.. ముంపు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అవసరమైన సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. కాగా, హైదరాబాద్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో రానున్న మరికొన్ని గంటల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోడ్లపై భారీగా నీరు నిలిచి ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు నగర ప్రజలకు సూచించారు. నీటితో నిండిన రహదారులపై వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని హెచ్చరించారు.








