Mahaa Daily Exclusive

  రామగుండం యూరియా కోసం కేంద్రంపై ఉద్యమిస్తాం!

Share

రామగుండం యూరియా కోసం కేంద్రంపై ఉద్యమిస్తాం!
* హామీ మేరకు ఎరువులు సరఫరా చేయట్లేదు.
* తెలంగాణ రైతాంగంపై కేంద్రానిది కక్ష పూరిత చర్యేనా..?
* రైతులు తొలి వర్షానికే విత్తనాలు వేయొద్దు.
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, మహా.
రామగుండం కర్మాగారంలో తయారయ్యే ఎరువులను తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా పొందేలా కేంద్ర ప్రభుత్వంపై అవసరమైతే ఉద్యమిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ప్రతి నెలా రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని చెప్పి, హామీ ఇచ్చిన మేరకు కేంద్రం ఎందుకు సరఫరా చేయడం లేదని ఆయన నిలదీశారు. గురువారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. రాష్ట్రానికి సరిపడా యూరియా కోటాను తక్షణమే విడుదల చేయాలని కోరేందుకు తాము త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని స్వయంగా కోరనున్నట్లు ఆయన వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి తుమ్మల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం కేవలం కనీస మద్దతు ధర ప్రకటించి, ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ నుంచి పూర్తిగా తప్పుకుంటోందని ఆయన విమర్శించారు. కనీసం ఒక్క గింజ మొక్కజొన్నను కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేదని ఆయన నిలదీశారు. కేంద్రం అవలంబిస్తున్న ఇటువంటి పద్ధతులను తెలంగాణ రైతాంగంపై చూపిస్తున్న కక్షగా భావించాలా..? అంటూ మంత్రి తుమ్మల ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తమ రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ముఖ్యమైన సూచన చేశారు. తొలి తొలకరి వర్షానికే రైతులు తొందరపడి విత్తనాలు వేస్తే నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కనీసం రెండు సార్లు మంచి వర్షం పడితేనే భూమికి సరిపడా తడి వస్తుందని, అన్నదాతలు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించి సాగు పనులు ప్రారంభించాలని మంత్రి సూచించారు.