Mahaa Daily Exclusive

  రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు బ్రేక్!

Share

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు బ్రేక్!
* మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు.
* టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు.
* ఐదు ఎకరాలు తమదేనంటూ కోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ.
హైదరాబాద్, మహా.
నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గం భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూముల వేలంపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మూడు వారాల లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అలాగే సదరు భూమిని దక్కించుకున్న గౌర వెంచర్స్ సంస్థలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమికి ఇటీవల టీజీఐఐసీ భారీ స్థాయిలో బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలంలో సదరు స్థలాన్ని ఎకరాకు రికార్డు స్థాయిలో రూ. 237 కోట్ల చొప్పున వెచ్చించి గౌర వెంచర్స్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే, వేలం వేసిన ఆ భూమిలో 5 ఎకరాల స్థలం తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్టుండి హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బ్యాంకు అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న ఆ 5 ఎకరాల భూమిని తిరిగి తమకే ఇప్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్బీఐ తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన అనంతరం రాయదుర్గం భూముల వేలం ప్రక్రియపై స్టే విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.