తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కల్యాణ్ శ్రీకారం.
• నేడు మల్కం చెరువు సమీపంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవం.
• పార్టీ శ్రేణులకు భారీగా అందిన ఆహ్వానాలు.
హైదరాబాద్:మహా.
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని మల్కం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ నూతన కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో కార్యాలయ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు, సమావేశాలు, ఇతర కార్యకలాపాలకు ఈ నూతన కార్యాలయమే ప్రధాన కేంద్రంగా మారనుందని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం సాగుతోంది.
ఈ కొత్త కార్యాలయం ఏర్పాటుతో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. పటిష్టమైన సంస్థాగత నిర్మాణం, ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడం ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జనసేనను ఒక కీలక శక్తిగా మార్చే దిశగా ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.








