కేటీఆర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల అగ్రహం.
* ఉపాధిని దెబ్బతీస్తే ఊరుకునేది లేదు.
* వాడగూడెంలో అత్యవసర సమావేశం.
* ఆధారాలు చూపాలని సవాల్.
ములుగు,మహా.
జిల్లాలోని ఇసుక క్వారీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మండలంలోని పలు గిరిజన సంఘాలు, నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం వాడగూడెంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గిరిజన ఇసుక సొసైటీల ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతూ ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, వారి అభివృద్ధిని అడ్డుకునేలా కేటీఆర్ మాట్లాడటం తగదన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో జరిగిన ఇసుక దోపిడీపై స్పందించని కేటీఆర్, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడుతున్న క్వారీలపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేద ప్రజల పొట్టగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇసుక వ్యాపారం ఎంత పారదర్శకంగా జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలని, ఎక్కడైనా ఒక్క టన్ను ఓవర్‌లోడ్ వెళ్తున్నా, అక్రమ రవాణా జరుగుతున్నా ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు.
ఎవరో చెప్పిన దొంగ మాటలు విని ఒక ప్రధాన రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ గిరిజనుల ఉపాధిపై దెబ్బకొట్టాలని చూస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆరోపణలు చేసే ముందు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకోవాలని, లేనిపక్షంలో ఆధారాలు లేకుండా మాట్లాడటం ఆయన రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరమని గిరిజన నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి మాట్లాడితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని హితవు పలికారు. ఈ అత్యవసర సమావేశంలో పలు గిరిజన సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.








