Mahaa Daily Exclusive

  జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు దశలవారీ పోరాటం…

Share

*జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు దశలవారీ పోరాటం…*

* నల్ల బ్యాడ్జీలతో ధర్నా.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత…

సత్తుపల్లి, జూన్ 18: మహా.

నియోజకవర్గ కేంద్ర ఆర్‌సీ ఇన్‌చార్జ్‌లకు మండల స్థాయి అక్రిడేషన్ కార్డులు, జిల్లా బస్సు పాసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ యూనియన్లకు అతీతంగా సత్తుపల్లికి చెందిన జర్నలిస్టులు గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం దశలవారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు వినతిపత్రం అందజేసి, గతంలో అమలులో ఉన్న విధానంలోనే అక్రిడేషన్ కార్డులు, బస్సు పాసులు మంజూరు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అందే శాశ్వత ప్రయోజనాలైన అక్రిడేషన్ కార్డులు, బస్సు పాసుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని విమర్శించారు. బ్యూరోలు, డెస్క్ జర్నలిస్టులు, మండల విలేకరులను వేర్వేరుగా విభజించి, కార్డుల రంగుల్లోనూ తేడాలు చూపడం తగదన్నారు. జీవో నెం.252 జర్నలిస్టుల మధ్య చిచ్చు పెట్టిందని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను అనేక విధాలుగా విస్మరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కొన్ని జర్నలిస్టు సంఘాలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న విలేకరులకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. జర్నలిస్టులకు లభిస్తున్న ఏకైక రాయితీ అయిన బస్సు పాసులను కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా నిరోధించడం సమంజసం కాదన్నారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో ముందుండాల్సిన సంఘాలు ప్రశ్నించే ధైర్యం చూపకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గత 15 నుంచి 20 ఏళ్లుగా అమలులో ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న పత్రికల ఆర్‌సీ ఇన్‌చార్జ్‌లకు గుర్తింపు కల్పించి, జిల్లా అక్రిడేషన్‌తో పాటు రాష్ట్ర స్థాయి బస్సు పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు న్యాయం జరగని పక్షంలో హక్కుల కోసం మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని, అవసరమైతే యూనియన్ల నుంచి వైదొలగడానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు లు
మాదిరాజు సుధాకర్, భీమిశెట్టి రాము, ఎండి షైబుద్దిన్, చీనేని బాలకృష్ణ, ఎస్కే ఖాదర్ బాబా, తోట కిరణ్, రామ్ శెట్టి లక్ష్మణరావు, తడికమల్ల దేవదానం, నిమ్మగడ్డ శ్రీకాంత్, రాజేష్ రెడ్డి, ఐ శ్రీను, ఆనంద్, జె శ్రీనివాస్, మోహన్, రామారావు, సురేష్, మెహరాజ్, సుధాకర్, గురవయ్య, రామకృష్ణ,గంగాధర్, రాంబాబు, అశోక్, చిరాంజీవి, జగన్ తదితరులు పాల్గొన్నారు.