మణుగూరులో భారీగా గంజాయి పట్టివేత..
– 80 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్..
– స్కార్పియో వాహనం స్వాధీనం
– పోలీసుల అదుపులో అంతర్రాష్ట్ర ముఠా
మణుగూరు, మహా :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని తొగ్గుడెం ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం నుంచి ఒడిశా వైపు స్కార్పియో వాహనంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రత్యేక తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక మహేంద్ర స్కార్పియో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో సుమారు 80 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్ లుగా గుర్తించారు. వీరు భద్రాచలం ప్రాంతం నుంచి ఒడిశా రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి వెల్లడించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు ముమ్మరం చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో సీఐ నాగబాబు, ఎస్సైలు నగేష్ కుమార్, రవుఫ్, హెడ్ కానిస్టేబుల్ దామోదర్, కానిస్టేబుల్ మురారి తదితరులు పాల్గొన్నారు.








