ఈక్వాలిటీ పేరుతో చెత్త విషయాలు వద్దు!
* సినీ పరిశ్రమ కొత్తవారికి సురక్షితం కాదు.
* కాస్టింగ్ కౌచ్, ఫెమినిజంపై సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
దశాబ్దాలుగా తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది సంగీత అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పదిహేడేళ్ల చిరుప్రాయంలోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఆమె.. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, కాస్టింగ్ కౌచ్, అలాగే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న స్త్రీ సమానత్వం (ఫెమినిజం) వంటి సున్నితమైన అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సినీ పరిశ్రమలో మహిళలపై జరిగే వేధింపుల గురించి సునీత కుండబద్దలు కొట్టారు. ఇండస్ట్రీలో వేధింపులు జరుగుతున్నాయనేది అక్షరాలా నిజమని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఇది ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకున్న వారి కంటే కూడా.. కొత్తగా అవకాశాల కోసం వచ్చే అమాయకపు అమ్మాయిల విషయంలోనే చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను సైతం సునీత గుర్తుచేసుకున్నారు. తనకు పద్దెనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని, అయితే అవి తీవ్రమైన స్థాయిలో లేకపోవడం గమనార్హమని అన్నారు. ఇండస్ట్రీ అనేది కొత్తగా వచ్చే వాళ్లకు ఏమాత్రం సేఫ్ ప్లేస్ కాదని ఆమె తేల్చి చెప్పారు. ఇక్కడ సురక్షితంగా ఉండాలంటే మానసికంగా, ఎమోషనల్‌గా, శారీరకంగా, అలాగే ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉండాలని, అప్పుడే ఈ రంగుల ప్రపంచంలో తట్టుకుని నిలబడగలరని సునీత స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ప్రస్తుత రోజుల్లో బట్టల ఎంపిక, వ్యక్తిగత స్వేచ్ఛ తదితర అంశాలపై నడుస్తున్న చర్చలపైనా సునీత ఘాటుగా స్పందించారు. చాలామంది ‘నా బాడీ నా ఇష్టం.. నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా’ అని మాట్లాడుతున్నారని, దానిని ఫెమినిజం, సమానత్వంతో ముడిపెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘నీ బాడీ నీ ఇష్టం’ అని ఒక మహిళ అంటే, దానికి బదులుగా ‘నా కళ్లు నా ఇష్టం.. నేను చూస్తా’ అని అవతలి వ్యక్తి అనొచ్చని ఆమె లాజిక్ తీశారు. ఎవరికి నచ్చిన బట్టలు వారు వేసుకోవచ్చని, అందులో అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెబుతూనే.. ఆ వ్యక్తిగత కోరికను సమాజం మీద రుద్దడం, దానికి సమానత్వం అని పేరు పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు.
మహిళలు సిగరెట్ తాగడాన్ని కూడా సమానత్వంగా భావించడాన్ని సునీత తీవ్రంగా ఖండించారు. సిగరెట్ విషయంలో మగవాళ్లు, ఆడవాళ్లు అస్సలు సమానం కాదని స్పష్టం చేశారు. ఒక సిగరెట్ తాగితే మగవాడి కంటే ఆడవాళ్ల శరీరానికి జరిగే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమానత్వం పేరుతో ఇలాంటి చెత్త విషయాలను చర్చించడం తనకు ఏమాత్రం నచ్చదని ఆమె తెగేసి చెప్పారు. మహిళలకు సమాజంలో ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయని, దయచేసి వాటి గురించి మాట్లాడాలని ఆమె పిలుపునిచ్చారు. దాపరికం లేకుండా సునీత చేసిన ఈ వాస్తవిక వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట సైతం సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.







