- ముంపు మేస్త్రిలా ముఖ్యమంత్రి తీరు.
- హరీశ్‌రావు తీవ్ర ధ్వజం.
హైదరాబాద్, మహా.
తన రాజకీయ స్వార్థం, గురువుకు ‘గురుదక్షిణ’ సమర్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ జలహక్కులను ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద పూర్తిగా తాకట్టు పెట్టారని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదీ జలాలపై కనీస అవగాహన లేని సీఎం.. రాష్ట్రాన్ని ముంచే ‘ముంపు మేస్త్రి’గా మారారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని రేవంత్ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని ఆవేదన వ్యక్తం చేశారు.
దిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కనీసం లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టడం దారుణమన్నారు. ఏపీతో అనుబంధం ఉన్న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు సమక్షంలో జరిగిన ఆ రహస్య సమావేశంలో కుదిరిన చీకటి ఒప్పందం ఏంటో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. తుంగభద్రకు దిగువన కర్ణాటక 35 టీఎంసీలతో నవేలి రిజర్వాయర్, ఆర్డీఎస్ దిగువన ఏపీ 20 టీఎంసీలతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమయ్యాయని, ఈ 55 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టుకు చుక్క నీరు రాదని, తద్వారా పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకుని గుండ్రేవుల ప్రాజెక్టును అడ్డుకోగా, ఏపీ ముఖ్యమంత్రి శిష్యుడైన రేవంత్ అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో గోదావరి బేసిన్లో రికార్డు స్థాయిలో 383 టీఎంసీలకు అనుమతులు సాధిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో కనీసం ఒక్క టీఎంసీకి కూడా అనుమతి తేలేకపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఏపీ తన వాటాను పూర్తిగా వాడుకుని నదుల అనుసంధానం పేరిట మరో 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర చేస్తోంటే రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డికి ఎన్ఓసీ తెచ్చే నెపంతో.. నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఏపీ ప్రయోజనాల కోసం బలిపెడుతున్నారని దుయ్యబట్టారు.
హైడ్రా కూల్చివేతల్లో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి, నీళ్ల విషయంలో మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన ‘నీరో చక్రవర్తి’లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గోదావరి జలాల్లో 968 టీఎంసీల హక్కులను కాపాడారా, సమ్మక్క సాగర్ ఇంటర్ లింకింగ్ ద్వారా 50 శాతం నీళ్లు రాష్ట్రానికి వస్తున్నాయా లేదా, ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీల వాటాను సాధిస్తారా, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని కనీసం ఒక లేఖ అయినా రాస్తారా.. తదితర అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జల వివాదాలపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు, ముగ్గురు సీఎంల భేటీలో జరిగిన అంశాలను శాసనసభలో పెట్టి సమగ్రంగా చర్చించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.







