- అర్ధరాత్రి దాడులతో గుట్టురట్టు చేసిన పోలీసులు.
- తీవ్ర నిరాశలో 4.28 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు.
ఢిల్లీ, మహా.
దేశంలో పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (TET) ప్రశ్నపత్రం పరీక్షకు కేవలం 24 గంటల ముందే లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఆదివారం (జూన్ 28) జరగాల్సిన టెట్ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి శనివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకతను, విశ్వసనీయతను కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మండలి స్పష్టం చేసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. థానే రీజియన్ పరిధిలో టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు శనివారం తెల్లవారుజామున పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీనిపై భివండీ పోలీసులు తక్షణమే స్పందించి ఒక రహస్య స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించారు. అక్కడ కొందరు వ్యక్తుల వద్ద సీల్డ్ టెట్ క్వశ్చన్ పేపర్ ప్యాకెట్‌కు సంబంధించిన పేజీలు లభ్యమవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే పరీక్షల మండలి ఉన్నతాధికారులను రప్పించి, లభ్యమైన పేజీలను అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చి చూశారు. అవి లీక్ అయిన ఒరిజినల్ పేపరేనని తేలడంతో భివండీ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ భారీ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,028 పరీక్షా కేంద్రాలలో ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష కోసం సుమారు 4.28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం ఎంతో కాలంగా శ్రమించి, అన్ని ఏర్పాట్లు చేసుకుని, తీరా పరీక్షా కేంద్రాలకు బయలుదేరే సమయానికి పేపర్ లీక్ కారణంగా పరీక్ష వాయిదా పడడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురవుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని అభ్యర్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.








