Mahaa Daily Exclusive

  మూడు నెలల్లో ఎన్నికలు రావొచ్చు…

Share

  • మూడు నెలల్లో ఎన్నికలు రావొచ్చు
  • డీఎంకే శ్రేణులకు స్టాలిన్‌ పిలుపు
  • ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు
  • టీవీకే హయాంలో అభివృద్ధి మందగించిందన్న మాజీ సీఎం

చెన్నై, మహా : తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అన్నారు. మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మూడు నెలలు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదన్నారు. 118 సీట్ల మెజారిటీ అవసరం కాగా ఆ పార్టీకి 108 స్థానాలే వచ్చాయని గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతోందన్నారు. ఇటీవల వరకు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్‌ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని స్టాలిన్‌ సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత కాకుండా, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని కోరారు. డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

టీవీకే ప్రభుత్వంపై కూడా స్టాలిన్‌ విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందన్నారు. పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని ఆరోపించారు. మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, దోపిడీలు, పెట్రోల్‌ బాంబు దాడులు, విద్యుత్‌ కోతలు పెరిగాయని విమర్శించారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తమిళనాడులో ఉన్న సుపరిపాలన ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ప్రజలు విద్యుత్‌, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పాలన కంటే ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు సభలా కాకుండా సినిమా షూటింగ్‌లా మారిపోయాయని ఎద్దేవా చేశారు.