Mahaa Daily Exclusive

  నేడే కార్తీక పౌర్ణమి..  హిందువులకు పరమ పవిత్రమైన రోజు.. మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం..

Share

ఇల్లందు, నవంబర్ 14, మహా : కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అంటే కార్తీక మాసంలో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించినవారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు,కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన,మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

 

కేదారేశుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యునిని కూడా ఆరాధించిన వాళ్ళవుతున్నామనే సంప్రదాయం ఉంది. పాలు-పెరుగుతో శుక్రుని, తేనెతో గురువును, నెయ్యితో శనీశ్వరుని, కూరలతో చంద్రున్ని, ఫలాలతో బుధుని, బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 సంవత్సరాలపాటు నిర్వహించి 21వ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం (ముగింపు) చెప్పుకోవాలి. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచుకుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

 

సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినైయుండి ఆ దండప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించటం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది. కైలాసాన్ని వదలి. శరభ శార్దూల గజములుగల నాగ గరుడ చకవాక పక్షసముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొనిన్న సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిధి మర్యాదలు చేసి తల్లీ నీవెవరివి ఎవరిదానవు ఎక్కడనుండి వచ్చివు నీరాకకు గల అగత్యమేమిటి? అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమంలో నియమనిష్టాగరిష్టులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివునిసతిగా నా నాధునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకొన్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పింది పార్వతి. మహర్షులారా! జగత్కళ్యాణాభిలాషులారా! నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండని పార్వతి వారిని కోరుకుంది. అందుకు గౌతముడు పార్వతీ! ఈప్సితార్ధదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తరువాత ఉజ్జయినీ నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి జనకా మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి యివ్వండ అని అడిగారు. అందుకు అతను బిడ్డలారా! నేను దరిద్రుడను. సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరా ఆలోచనను మానుకోండని పలికాడు. అందుకా వైశ్యపుత్రికలు నీ ఆఙ్ఞయే మాకు ధనము అనుమతిని యివ్వవలసిందని కోరుకున్నారు. వారిద్దరూ ఒక వటవృక్షంక్రింద కూర్చుని తోరముకట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారికి పూజాసామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్థానమయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్తవయసు వచ్చింది. సౌందర్యసోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయినీ నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియైన వైశ్యుడు ధనదాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్నకుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారవ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. వారిని రాజ్యం నుంచి వెల్లగొట్టడం జరుగుతుంది. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడ్ని చెంతకు పిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకొని రావలసిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినీకి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడ్ని సాగనంపింది. అతడు తిరిగివస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరల పెద్దతల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత దనాన్నిచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యలో చోరురూపుడైన శివుడాసొమ్మును తీసుకొనిపోయాడు. మరల అతడు పెద్దతల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ..ఓయి! నీవు ఎన్నిసార్లు నీ పెద్దతల్లి నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారవ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్దతల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు. అప్పుడామె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారవ్రతాన్ని చేసింది. ఆమె భర్త మందీమార్భలంతో వచ్చి ఆమెను, కుమారుడ్ని రాజధానికి తీసుకొని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యసంపదలతో జీవిస్తున్నది. ఇలా జరిగినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి.

Latest