Mahaa Daily Exclusive

  ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ…

Share

  • ప్రపంచ ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ
  • హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్‌కు దిశానిర్దేశం
  • గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం
  • వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల పనులు త్వరలో ప్రారంభం…
  • కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో గ్రీన్ సిగ్నల్

 

హైదరాబాద్, మహా : ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవబోతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన ఏరోమార్ట్ హైదరాబాద్–2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ & డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా అని స్పష్టం చేశారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, సూపర్‌సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు ప్రత్యక్ష అనుభవం ఉందన్నారు. ఒక్క చిన్న విడిభాగం లోపం కూడా మిషన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయని చెప్పారు.

 

అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్–16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు, ఎంఆర్ఓ వ్యవస్థలు నేడు తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. “‘మేడ్ ఇన్ తెలంగాణ’ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది” అని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఎయిరో, కెనడాకు చెందిన ఎప్ టీజీ ఎయిరో స్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్, ఇటలీ సహా 25కిపైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యతను మరింత పెంచిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 1,500కు పైగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్‌ఎంఈలు పనిచేస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు.

 

డీఆర్‌డీఓ, రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ప్రైవేట్ పరిశ్రమలు ఒకే నగరంలో ఉండటం హైదరాబాద్‌కు ప్రపంచ స్థాయి పోటీ సామర్థ్యాన్ని కల్పించిందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న ఐటీఐలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగ విస్తరణకు చారిత్రక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలాబాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్ర ఆమోదం లభించనున్నాయని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు భవిష్యత్తులో విమాన మరమ్మత్తు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలను తెరవనున్నాయని చెప్పారు.

 

ప్రపంచ ఏరోస్పేస్ దిగ్గజాలను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “మీ తదుపరి తయారీ కేంద్రం తెలంగాణ కావాలి. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్‌లో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మీకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వం మాత్రమే కాదు… మీ విజయానికి భాగస్వామిగా నిలిచే ప్రభుత్వం” అని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధుల నుంచి అధికార యంత్రాంగం వరకు పెట్టుబడిదారులకు 24 గంటలూ అందుబాటులో ఉంటామని, పరిశ్రమల స్థాపన, విస్తరణలో ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ఏరోమార్ట్ హైదరాబాద్–2026 కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదు… ప్రపంచ ఏరోస్పేస్ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.